ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ ‘జుల్మ్’ను (దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొ.) తనపై నిషేధించుకున్నాడు, అలాగే ‘జుల్మ్’ ను తన సృష్ఠిరాశులలో కూడా నిషేధించినాడు. కనుక ఏ ఒక్కరూ కూడా మరొకరిపై దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొదలైన వాటికి పాల్బడరాదు – అని తెలియజేస్తున్నారు. ఇంకా, కేవలం ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శనం గావించినాడో, వారు తప్ప సృష్ఠి మొత్తం కూడా సత్యమార్గం నుండి మార్గభ్రష్ఠులైన వారేనని, మరియు ఎవరైతే అల్లాహ్ ను సత్యమార్గం వైపునకు మార్గదర్శక భాగ్యం కలుగ జేయమని అర్థిస్తారో, అల్లాహ్ వారికి సత్యమారం వైపునకు మార్గదర్శక భాగ్యం కలుగజేస్తాడు అని తెలియ జేసినారు. అల్లాహ్ సమక్షంలో అందరూ పేదవారే, వారి ఏ ఒక్క అవసరం కొరకైనా అల్లాహ్ పై ఆధారపడి ఉన్న స్థితిలో ఉన్న వారే. ఎవరైతే తమ అవసరాల కొరకు అల్లాహ్ ను అర్థించినారో, అల్లాహ్ వారి అవసరాలను తీర్చినాడు మరియు అల్లాహ్ వారి అవసరాలు తీర్చేందుకు వారి కొరకు సరిపోతాడు. మానవులు రాత్రులయందు, పగటియందు కూడా పాపపు పనులకు పాల్బడతారు. మరియు ఎపుడైతే దాసుడు పాపక్షమాపణ కొరకు సర్వోన్నతుడైన అల్లాహ్ ను వేడుకుంటాడో, అల్లాహ్ అతడి పాపాలను కప్పివేస్తాడు, చూసీ చూడనట్లు వదిలివేస్తాడు మరియు క్షమిస్తాడు. మానవులు అల్లాహ్’కు ఏమీ ప్రయోజనం కలిగించలేరు. అలాగే ఎలాంచి హాని గానీ, నష్టము గానీ కలిగించలేరు. ఒక మానవుని అత్యంత దైవభీతి కలిగిన హృదయానికి మాదిరిగా, మానవులందరూ అత్యంత దైవభీతి గలవారిగా అయిపోయినా వారి దైవభీతి ఆయన ప్రభుతలో ఏమాత్రమూ వృధ్ధి చేయజాలదు. ఒక మానవుని అత్యంత దుష్ఠత్వము కలిగిన హృదయానికి మాదిరిగా, మానవులందరూ అత్యంత దుష్ఠులుగా అయిపోయినా వారి దుష్ఠత్వము ఆయన ప్రభుతలో ఏమాత్రమూ లోపము కలుగ చేయజాలదు మరియు నష్టపరుచజాలదు. ఎందుకంటే, వారంతా అల్లాహ్ సమక్షములో ఆశ్రితులు, నిరుపేదలు. వారు ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా, ఏ స్థితిలో ఉన్నా ప్రతి చిన్న అవసరం కోసం ఆయనపై ఆధారపడవలసి ఉన్న స్థితిలో ఉన్నవారు. కేవలం ఆయన మాత్రమే సంపన్నుడు, అన్నిరకాల సంపదలకూ ప్రభువు. సర్వ స్తోత్రములూ ఆయనకే చెందుతాయి. మానవులూ మరియు జిన్నులూ, వారిలోని మొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు అందరూ ఒక మైదానం లో నిలబడి , తమ కోరికలు తీర్చమని అల్లాహ్ ను వేడుకున్నట్లయితే మరియు అల్లాహ్ వారందరూ కోరుకున్న ప్రతిదీ ప్రసాదించినట్లయితే, అది అల్లాహ్ వద్ద నున్న దానిని (సంపదను) ఏ మాత్రమూ తగ్గించదు, ఏవిధంగానైతే ఒక సూది మొనను సముద్రంలో ముంచి పైకి తీస్తే, అది సముద్రము నుండి ఏమీ తగ్గించలేదో ఆ విధంగా. ఇది అల్లాహ్ సుసంపన్నత యొక్క సంపూర్ణత్వము. సర్వ స్తోత్రములూ ఆయనకే చెందుతాయి అని తెలుపుతున్నది. పరమ పవిత్రుడైన అల్లాహ్ తన దాసుల ఆచరణలను సురక్షితంగా ఉంచుతాడు మరియు వారి నుండి ఆ ఆచరణల లెక్క తీసుకుంటాడు. తీర్పు దినము నాడు వారికి వారి ఆచరణల ప్రతిఫలం అందజేస్తాడు. ఎవరైతే తన మంచి ఆచరణలకు గాను మంచి ప్రతిఫలాన్ని పొందుతాడో, అల్లాహ్ యొక్క విధేయతలో ఆ సత్కార్యాలను ఆచరించే భాగ్యాన్ని కలుగ జేసినందుకు అతడు అల్లాహ్ ను స్తుతించాలి. మరియు ఎవరైతే తన చెడు ఆచరణలకు మంచి ప్రతిఫలం గాక మరింకేదైనా పొందితే, అందుకు ఎవరినో కాకుండా అతడు తనను తానే నిందించుకోవాలి, ఎందుకంటే అందుకు కారణం అతడే కనుక.