ఇందులో అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు) – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారని తెలియజేస్తున్నారు. “ఖుత్బతుల్ హాజహ్” అంటే “అవసర సమయపు ప్రసంగం” అని తెలుగులో అనువదించవచ్చు. సాధారణంగా ఏదైనా అవసరానికి సంబంధించి ప్రసంగం ఇవ్వబడే సమయములో, ప్రధాన ప్రసంగానికి ముందు ఈ ‘ఖుత్బతుల్ హాజహ్’ ప్రసంగం చదువబడుతుంది. తరువాత ప్రధాన ప్రసంగం మొదలవుతుంది. ఉదాహరణకు వివాహ సమయమున ఇవ్వబడే ప్రసంగం, శుక్రవారం నాడు ‘జుమా ఖుత్బా’ ప్రారంభానికి ముందు. ఈ ఖుత్బతుల్ హాజహ్ చాలా గొప్ప అర్థాలు కలిగి ఉంది. ఉదాహరణకు సకలస్తోత్రములు మరియు సమస్తమైన ప్రశంసలు అన్నీ కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకము అనుట, కేవలం ఆయన నుండి మాత్రమే సహాయం కోరుకొనుట, పాపములకు క్షమాభిక్ష కొరకు కేవలం ఆయనను మాత్రమే వేడుకొనుట, మరియు పాపముల నుండి దూరంగా ఉండుట కొరకు ఆయన సహాయం కోరుట, మనలోని కీడులనుండి, మరియు ఇతర కీడుల నుండి ఆయన రక్షణ కోరుకొనుట మొదలైనవన్నీ. అలాగే ఇందులో సన్మార్గదర్శకం కేవలం అల్లాహ్ నుండి మాత్రమే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ఎవరినైతే అల్లాహ్ సన్మార్గానికి మార్గదర్శకం చేసినాడు, అతడిని ఎవరూ మార్గభ్రష్టుడిని చేయలేరు. అలాగే ఎవరినైతే అల్లాహ్ అపమార్గములో వదలివేసినాడొ, అతడిని ఎవరూ సన్మార్గానికి తీసుకు రాలేరు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘తౌహీదు’ యొక్క సాక్ష్యమును – అంటే ‘అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అని సాక్ష్యమిచ్చుటను – ప్రస్తావించినారు, అలాగే ‘రిసాలహ్ యొక్క సాక్ష్యమును’ – అంటే ‘ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుటను – ప్రస్తావించినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బతుల్ హాజహ్ ను మూడు ఖుర్’ఆన్ ఆయతులను పఠించి ముగుంచినారు. ఆ ఆయతులలో అల్లాహ్ ఆదేశించిన పనులను, కేవలం ఆయన సామీప్యము, ఆయన సాన్నిధ్యము, కరుణ కొరకు మాత్రమే ఆచరించాలని, ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండాలని, ఆ విధంగా అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (భయభక్తులు) కలిగి ఉండాలని – ఎవరైతే అలా చేస్తారో వారి ఆచరణలు, వారి మాటలు సరియైనవిగా, న్యాయ బధ్ధమైనవిగా ఉంటాయి. వారి పాపాలు క్షమించబడతాయి, వారికి ఈ ప్రపంచములో మంచి జీవితం ప్రసాదించబడుతుంది, మరియు పరలోకములో విజయులై స్వర్గములో ప్రవేశింపజేయబడతారు.