ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక ముస్లిం జామాఅత్ తో పాటు సలాహ్ (నమాజు) ఆచరించినట్లయితే అది అతడు తాను ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం) లోనో ఆచరించిన సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది. తరువాత దాని కారణాన్ని ఇలా వివరిస్తున్నారు: అతడు సలాహ్ కొరకు ఉత్తమంగా మరియు పరిపూర్ణంగా ఉదూ ఆచరిస్తాడు; తరువాత అతడు మస్జిదుకు బయలుదేరుతాడు – కేవలం సలాహ్ ఆచరించే సంకల్పముతో బయలు దేరుతాడు; దానితో అతడు వేసే ప్రతి అడుగు అతడి స్థాయిని ఉన్నతం చేస్తుంది; ప్రతి అడుగు అతడి నుంచి ఒక పాపాన్ని తొలగిస్తుంది. తరువాత అతడు మస్జిదులోనికి ప్రవేశించి, కూర్చుని సలాహ్ కొరకు ఎదురుచూస్తూ వేచి ఉన్నట్లయితే, అతడు వేచి ఉన్న కాలమంతా అతడు సలాహ్ లోనే గడిపినంత పుణ్యాన్ని పొందుతాడు. అతడు, తాను సలాహ్ ఆచరించి కూర్చుని ఉన్న స్థలం లోనే గడిపినంత కాలం దైవదూతలు అతని కొరకు అల్లాహ్ ను ప్రార్థిస్తూ, ఇలా అంటారు: “ఓ అల్లాహ్! అతడిని క్షమించు (అతడి పాపాలను మన్నించు); ఓ అల్లాహ్! అతడిని కరుణించు; ఓ అల్లాహ్! అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించు”. ఇలా అతడు తన ఉదూను భంగపరచనంత వరకు, లేదా, ఇతరులకు లేదా దైవదూతలకు కష్టం కలిగించే ఏ పనీ చేయనంతవరకు ప్రార్థిస్తూ ఉంటారు.