ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే పచ్చి ఉల్లిపాయలు, పచ్చి వెల్లుల్లి తిన్నాడో అతడు మస్జిదుకు రారాదని నిషేధించినారు - అలా వాటిని తిని, దాని వాసన వస్తున్న నోటితో మస్జిదుకు వచ్చినట్లయితే, జమాఅత్’తో నమాజు చదవడానికి వచ్చిన తన సోదరులను ఇబ్బందికి గురిచేస్తాడు అనే ఉద్దేశ్యంతో. ఈ నిషేధాన్ని ‘తన్’జీహీ’ అంటారు; అంటే ఇది, వాటిని తిని వాసన వచ్చే నోటితో మస్జిదుకు రావడాన్ని మాత్రమే నిషేధిస్తున్నది, వాటిని తినడం నుండి కాదు; ఎందుకంటే అవి ‘హలాల్’ (షరియత్ అనుమతించిన) ఆహారపదార్థాలు. తరువాత కూరగాయలతో కూడిన ఒక కుండను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి తీసుకు రావడం జరిగింది. దాని నుండి వస్తున్న వాసనను చూసి, దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు దానిలో ఏమి ఉన్నదో తెలియజేయడం జరిగింది. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని తినడానికి ఇష్టపడలేదు. వారు ఆ కుండను తనతోపాటు ఉన్న సహచరుల వైపునకు పంపినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను అనుకరిస్తూ వారు కూడా దానిని తినడానికి అయిష్టత చూపినారు. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు తినండి! ఎందుకంటే నేను వహీ తీసుకుని వచ్చే దైవదూతలతో సంభాషిస్తుంటాను”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా తెలియజేసినారు – దుర్వాసన వలన మనుషులకు ఏ విధంగానైతే ఇబ్బంది, హాని కలుగుతుందో, అదేవిధంగా దైవదూతలకు కూడా కలుగుతుంది.