ఈ హదీసులో అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: మస్జిదులో సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి తన ఒంటెపై వచ్చి, దానిని అక్కడే కూర్చొనేలా చేసి దానిని కట్టివేసాడు. అపుడు అతడు “మీలో ముహమ్మద్ ఎవరు?” అని అడిగాడు. ఆ సమయములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య, తన చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నారు. మేము “అదుగో, తెల్లని మేని ఛాయతో, చేరగిలబడి కూర్చొన్నది ఆయనే” అన్నాము. ఆ మనిషి ఆయనతో “ఓ అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడా” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో “నేను వింటున్నాను, అడుగు ఏం అడగాలను కుంటున్నావో, నేను సమాధానం ఇస్తాను” అన్నారు. అపుడు ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో “నేను నిన్ను ప్రశ్నిస్తాను. కఠినంగా ఉంటాను. కనుక ఏమీ భావించకు” అన్నాడు. అంటే: నాపై కోపం తెచ్చుకోకు, మరియు మనసులో కష్టం పెట్టుకోకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో “అడుగు, ఏం అడగాలని అనుకుంటున్నావో” అన్నారు. అతడు “నీ ప్రభువు సాక్షిగా, నీ కంటే ముందు గతించిన వారి ప్రభువు సాక్షిగా అడుగుతున్నాను; అల్లాహ్ నిన్ను (తన సందేశహరునిగా) ప్రజల వద్దకు పంపినాడా?” అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ఇలా అన్నాడు “అల్లాహ్ ను సాక్షిగా పెట్టి ప్రశ్నిస్తున్నాను” – అంటే “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను” అని అర్థము – “ప్రతి దినము, రాత్రిలో ఐదు సార్లు సలాహ్ ఆచరించమని (నమాజు చదవమని) అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” అంటే అవి విధిగా ఆచరించవలసిన నమాజులు అన్నమాట. దానికి ఆయన “అల్లాహ్ సాక్షిగా అవును” అని జవాబిచ్చారు. అతడు తిరిగి “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను సంవత్సరము మొత్తములో, ఫలానా మాసములో ఉపవాసాలు పాటించమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” – అంటే అది రమదాన్ మాసము. ఆయన “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు తిరిగి “అల్లాహ్ సాక్షిగా ప్రశ్నిస్తున్నాను; మాలోని సంపన్నుల నుండి దానము తీసుకుని, మాలోని పేదవారికి పంచమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” – అంటే అది జకాతు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అని సమాధానం ఇచ్చారు. వెంటనే జిమామ్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో తాను తన తెగ ప్రజలను ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తానని అన్నాడు. తరువాత అతడు తనను తాను జిమామ్ ఇబ్న్ సాలబా, అని బనూ సాద్ బిన్ బక్ర్ తెగకు చెందిన వాడినని పరిచయం చేసుకున్నాడు.