ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణశయ్య పై ఉన్న తన చిన్నాన్నను (అబూ తాలిబ్ ను) చూడడానికి ఆయన గదిలోనికి ప్రవేశించినారు. తరువాత ఆయనతో ఇలా అన్నారు: “ఓ చిన్నాన్న! ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు) అను. ఈ ఒక్క మాటతో అల్లాహ్ ముందు నేను నీ కొరకు సాక్ష్యమిస్తాను.” అబూ జహ్ల్ మరియు అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్యహ్ ఇలా అన్నారు: “ఓ అబూ తాలిబ్, ఏం నీ తండ్రి అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్ని అంటే విగ్రహాలను ఆరాధించడం వదిలి వేస్తున్నావా నువ్వు? ” వారు పదేపదే ఆ విధంగా అనసాగారు. చివరికి ఆయన తన చివరి మాటగా వారితో ఇలా అన్నాడు: “అబ్దుల్ ముత్తలిబ్ ధర్మమైన బహుదైవారాధనను, విగ్రహారాధనను అనుసరిస్తున్నాను (అని ప్రాణం విడిచాడు). అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ నన్ను వారించేదాక నేను నీ క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూనే ఉంటాను”. అపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కులు అవతరించినాయి. { مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَنْ يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ} {అల్లాహ్’కు సాటి కల్పించే వారు (ముష్రికులు) దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించుట తగదు.} [సూరహ్: అత్-తౌబహ్ 9:113]. అప్పుడు అబూతాలిబ్’ను గురించి అల్లాహ్ యొక్క ఈ వాక్కులు అవతరించినాయి: { إِنَّكَ لا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَكِنَّ اللهَ يَهْدِي مَنْ يَشَاءُ} { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకం చేయలేవు. కానీ అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకం పొందే వారెవరో బాగా తెలుసు} [సూరహ్ అల్ ఖసస్ 28:56]. నిశ్చయంగా నీవు కోరిన వారికి మార్గదర్శకం చేయలేవు; కానీ అతనికి సత్య సందేశాన్ని (ఇస్లాంను) చేరవేయడం నీ బాధ్యత. అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకం చేస్తాడు.