ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు విషయాలను నిషేధించినారు: మొదటిది: ఒక స్త్రీ తన భర్త లేదా ఆమె ‘మహరమ్ పురుషులలో’ ఒకరు లేకుండా రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించకుండా నిషేధించడం; ‘మహరమ్ పురుషులు’ అంటే ఆమెను వివాహం చేసుకోవడం శాశ్వతంగా నిషేధించబడినవారు, ఉదాహరణకు: ఆమె బంధువులలో - ఆమె కొడుకు, తండ్రి, మామ, సోదరుడు, సొదరుని కొడుకు, సోదరి కొడుకు, తల్లి సోదరులు, లేదా తండ్రి సోదరులు వంటి బంధువులు మొదలైన వారు. రెండవది: ఒక ముస్లిం ఈద్ అల్ ఫిత్ర్ దినము నాడు మరియు ఈద్ అల్ అద్’హా దినము నాడు ఉపవాసము పాటించుటను నిషేధించినారు; అతడు మొక్కుబడిగా మొక్కుకుని ఉన్న ఉపవాసమును పాటించ దలచినా, లేక స్వచ్ఛంద (నఫిల్) ఉపవాసము పాటించ దలచినా, లేక పరిహారంగా పాటించవలసి ఉన్న ఉపవాసమును పాటించదలచినా – ఈ రెండు దినములలో పాటించరాదు. మూడవది: అస్ర్ నమాజు తరువాత సూర్యాస్తమయం వరకు ఏదైనా నఫిల్ నమాజు పాటించుట, మరియు ఫజ్ర్ నమాజు తరువాత సూర్యోదయం వరకు ఏదైనా నఫిల్ నమాజు పాటించుట – ఈ రెండూ నిషేధించబడినవి. నాలుగవది: మూడు మస్జిదులకు తప్ప – ఏదైనా ఒక నిర్దుష్ఠ ప్రదేశానికి, ఆ ప్రదేశము మహత్తు గల ప్రదేశము అని, లేదా అది మహా ఘనత గల ప్రదేశము అని, లేదా ఆ ప్రదేశాన్ని దర్శించడం వల్ల పుణ్యాలు రెట్టింపు అవుతాయని – ఇలాంటి విశ్వాసాలతో ప్రయాణించడం నిషేధించబడినది. కనుక, ఏ ఇతర మస్జిదులకు ప్రత్యేకంగా ప్రయాణం చేసి వెళ్ళరాదు, ఎందుకంటే ఈ మూడు మస్జిదులలో మాత్రమే పుణ్యఫలం రెట్టింపు అవుతుంది – అవి ఒకటి మస్జిదుల్ హరాం, రెండు మస్జిదున్’నబవీ మరియు మూడు మస్జిదుల్ అఖ్సా.