అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు, అతా ఇబ్న్ అబీ రబాహ్ తో “స్వర్గప్రవేశానికి అర్హులైన స్త్రీలలో నుండి ఒక స్త్రీని నీకు చూపించనా?” అని అన్నారు. దానికి అతా “తప్పనిసరిగా చూపించండి” అన్నారు. అపుడు ఆయన “ఒకసారి ఈ నల్లటి స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నది: “నాకు మూర్ఛవ్యాధి ఉన్నది, దాని కారణంగా నేను స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాను. ఆ స్థితిలో నాకు తెలియ కుండానే నా బట్టలు తొలగిపోయి, నా శరీరం అనాచ్ఛాదితం అయి నా శరీర భాగాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. నా వ్యాధి నయం చేయమని అల్లాహ్ ను ప్రార్థించండి.” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీవు కావాలనుకుంటే ఈ వ్యాధి పట్ల సహనం వహించు, నీకు స్వర్గం లభిస్తుంది. లేదా నువ్వు కోరుకుంటే నీ వ్యాధి నయం చేయమని అల్లాహ్’ను ప్రార్థిస్తాను.” అపుడు ఆ స్త్రీ ఇలా అన్నది: “అయితే నేను సహనం వహిస్తాను.” ఇంకా ఆమె ఇలా అన్నది: “అయితే నేను స్పృహ కోల్పోయి పడిపోతే నా బట్టలు తొలగి నేను అనచ్ఛాదితం కాకుండా ఉండేలా చేయమని అల్లాహ్’ను ప్రార్థించండి”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె కొరకు ఆ విధంగా దుఆ చేసినారు.