ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు: ఈ ప్రపంచం రుచిలో మధురమైనది, మరియు చూడడానికి సుందరమైనది. కనుక దాని వలన ఒక వ్యక్తి తేలికగా ప్రలోభానికి గురి అవుతాడు, అందులో మునిగిపోతాడు, మరియు దానినే తన కొరకు అత్యంత విలువైనదిగా మార్చుకుంటాడు. అల్లాహ్ ఈ ప్రాపంచిక జీవితములో మనకంటే ముందు వచ్చిన వారికి మనలను వారసులుగా చేసినాడు – ఏ విధంగా వ్యవహరిస్తామో చూడడానికి; ఆయనకు విధేయులుగా వ్యవహరిస్తామా లేక అవిధేయులుగానా? తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా హెచ్చరించినారు: జాగ్రత్త ఈ ప్రపంచపు సరంజామాతోనూ, మరియు దాని సౌందర్యముతోనూ మోసపోకండి; అది (ప్రపంచం) మిమ్ములను అల్లాహ్ ఆదేశించిన వాటిని వదిలేసి, ఆయన నిషేధించిన వాటిలో పడిపోవడానికి దారి తీస్తుంది. ఈ ప్రపంచపు ఆకర్షణలలో అన్నింటికన్నా పెద్దది స్త్రీలపట్ల ఆకర్షణ. ఇస్రాయీలు సంతతి పడిపోయిన మొదటి ఆకర్షణ అది.