అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విన్న ప్రతి విషయాన్ని రాసిపెట్టుకుంటూ ఉండే వాడిని, ఆ విధంగా రాతలో వాటిని భద్రపరిచి ఉంచుకునేందుకు గాను. కాని ఖురైషీయులు నన్ను వారిస్తూ, ఇలా అన్నారు: ‘రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కూాడా ఒక మానవమాత్రుడే (మనలాగే). ఆయన సంతోషములోనూ మాట్లాడుతారు, మరియు కోపములోనూ మాట్లాడుతారు. కనుక (మాటలలో) తప్పు జరగవచ్చు.” దానితో నేను రాయడం ఆపివేసినాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జరిగిన విషయాన్ని తెలియజేసినాను. అపుడు వారు వేలితో తన నోటిని చూపుతూ ఇలా అన్నారు: “రాయి (ఓ అబ్దుల్లాహ్!), ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలున్నాయో, ఆయన సాక్షిగా దీని నుండి (ఈ నోటినుండి) ఏ స్థితిలో నైనా సత్యము తప్ప మరేమీ బయటకు రాదు, సంతోషపు స్థితిలోనైనా లేక కోపపు స్థితిలోనైనా.” ఖుర్’ఆన్’లో సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇలా పలికాడు: “వమా యన్’తిఖు అనిల్ హవా, ఇన్’హువ ఇలా వహ్యున్ యూహా) “అతను తన మనోవాంఛలను అనుసరించి మాట్లాడడు*. అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింప జేయబడిన వ'హీ (దివ్యజ్ఞానం) తప్ప మరింకేమీ కాదు.” (సూరహ్ అన్’నజ్మ్ 53:3,4)