ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) — బదర్ యుద్ధంలో పాల్గొన్నవారు, తన జాతిలో పెద్దవారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు సహాయ పడేందుకు అఖ్బా రాత్రి మినాలో అంటే మదీనాకు వలస వెళ్ళక ముందు మక్కాలో ఉన్నప్పుడు ఆయనతో బైఅత్ (ప్రతిజ్ఞ) చేసినవారిలో ముందున్నారు — ఇలా పలికినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరుల మధ్య కూర్చుని, వారిని కొన్ని ముఖ్యమైన విషయాల్లో తనకు ప్రతిజ్ఞ (బైఅత్) చేయమని కోరారు..." మొట్టమొదటిది: వారు అల్లాహ్‌ను ఆరాధించడంలో ఎంత చిన్న భాగస్వామ్యాన్ని కూడా చేర్చకూడదు. రెండవది: వారు దొంగతనం చేయకూడదు. మూడవది: వారు వ్యభిచారం (అవాంఛిత లైంగిక సంబంధం) చేయకూడదు. నాలుగవది: వారు తమ పిల్లలను చంపకూడదు — ముఖ్యంగా ఆడపిల్లలను అవమాన భయంతో, లేదా అబ్బాయిలను పేదరికం భయంతో చంపకూడదు. ఐదవది: వారు అబద్ధాన్ని కల్పించి, తమ చేతులు, కాళ్లతో (చర్యల ద్వారా) దాన్ని ఆచరించరణలో పెట్టకూడదు. ఎందుకంటే, మనం చేసే చాలా పనులు ప్రధానంగా మన చేతులు, కాళ్ల ద్వారానే జరుగుతాయి, ఇతర అవయవాల ప్రమేయం ఉన్నా కూడా. ఆరవది: వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మంచిపనులలో (మారూఫ్) అవిధేయత చూపకూడదు. అందులో ఎవరు ఈ ఒప్పందాన్ని (ప్రతిజ్ఞను) నిలబెట్టుకుని, దానిని పాటిస్తారో, వారి ప్రతిఫలం అల్లాహ్ వద్ద ఉంటుంది. ఎవరైనా పైన చెప్పిన పాపాల్లో (అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం తప్ప) ఏదైనా చేసి, ఈ లోకంలో శిక్ష (హద్ శిక్ష) అనుభవిస్తే, అది అతనికి కఫ్ఫారా (పాప పరిహారం) అవుతుంది, దాంతో అతని పాపం క్షమించబడుతుంది. ఎవరైనా పాపం చేసినా, ఒకవేళ అల్లాహ్ దాన్ని దాచి పెడితే, అతని విషయం అల్లాహ్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది — అల్లాహ్ క్షమించ వచ్చు, లేక శిక్షించవచ్చు. అపుడు, అక్కడ ఉన్నవారందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ ఒప్పందాన్ని చేశారు.