ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఆచరణాత్మకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానాన్ని బోధించినారు. బాగా స్పష్టంగా ఉండేందుకు గాను, ఆయన ఒక పాత్రలో నీళ్ళు తెమ్మని అడిగారు. అందులో నుంచి తన చేతులపై నీళ్ళు ఒలుపుకుని మూడు సార్లు తన చేతులను కడిగినారు. తరువాత తన కుడి చేతిని నీళ్ళు ఉన్న పాత్రలో పెట్టి, అందునుండి నీళ్ళు తీసుకుని తన నోటిలో పోసుకుని బాగా పుక్కిలించి ఉమ్మివేసినారు, తరువాత తన ముక్కులోనికి నీరు పోనిచ్చి, చీదుతూ బయటకు తీసినారు, తరువాత ఆయన తన ముఖాన్ని మూడు సార్లు కడిగినారు, తరువాత ఆయన తన చేతులను మోచేతుల సమేతంగా మూడు సార్లు కడిగినారు, తరువాత తన అరచేతులను తడి చేసుకుని, తడిచేతులను ఒకసారి తన తలపై నుంచి పోనిచ్చినారు, తరువాత తన పాదాలను చీలమండలాల సమేతంగా మూడుసార్లు కడిగినారు. తరువాత ఆయన రజియల్లాహు అన్హు అక్కడి వారితో తాను చేసి చూపిన విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయగా తాను చూసినాను అని తెలిపినారు; మరియు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభవార్తను కూడా వినిపించినారు - ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసి చూపిన విధంగా వుజూ చేసి, ఖుషూతో రెండు రకాతుల నమాజును అంటే తన హృదయాన్ని సర్వ శక్తిమంతుడూ, సర్వోన్నతుడూ అయిన తన ప్రభువు సమక్షమున నిలిపి ఉంచి ఆచరిస్తాడో, అల్లాహ్ అతనికి - పరిపూర్ణంగా ఉదూ చేసి, కేవలం అల్లాహ్ కొరకే రెండు రకాతుల నమాజు ఆచరించినందుకు గాను అతని పూర్వ పాపాలు క్షమించడం ద్వారా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.