ఈ హదీసులోఅబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానాన్ని వాస్తవ రూపములో (ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా) చేసి వివరిస్తున్నారు. ఆయన ఒక చిన్న పాత్ర నిండా నీళ్ళు తీసుకురమ్మని అడిగారు. ముందుగా ఆయన తన రెండు చేతులను కడిగినారు – అందుకు ఆయన నీటి పాత్రను వొంచి నీటితో తన రెండు చేతులను మణికట్టు వరకు మూడు సార్లు, నీటి పాత్ర బయట, కడిగినారు. అపుడు ఆయన ఆ నీటి పాత్రలో చేయి పెట్టి మూడు సార్లు చేతి నిండా నీళ్ళు తీసుకుని (ఆ నీటితో) తన నోటిని పుక్కిలించి, ముక్కును చీది శుభ్రపరుచు కున్నారు. తరువాత ఆయన నీటి పాత్ర నుండి (అదే విధంగా మూడు సార్లు చేతి నిండా) నీళ్ళు తీసుకుని మూడు సార్లు తన ముఖాన్ని కడిగినారు. తరువాత ఆయన నీటి పాత్ర నుండి రెండు సార్లు చేతి నిండా నీళ్ళు తీసుకుని తన రెండు చేతులను మోచేతుల సమేతంగా కడిగినారు. తరువాత ఆయన రెండు చేతులను నీటి పాత్రలో పెట్టి, తడి అరచేతులతో తల మసాహ్ చేసినారు (తడిమినారు); ముందుగా ఆయన తన రెండు తడి అరచేతులను తల ముందు భాగము నుండి మొదలు పెట్టి తల వెనుక భాగాన మెడ వరకు తీసుకు వెళ్ళి, తరువాత అవే అరచేతులను అలాగే తల ముందు భాగానికి, ఎక్కడి నుండి మొదలు పెట్టినారో అక్కడికి, తీసుకు వచ్చినారు. అప్పుడు ఆయన రెండు పాదాలను చీలమండలాల వరకు కడిగినారు.