ఈ హదీసులో ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలియ జేస్తున్నారు: 'తన బాల్యంలో, ఒక సవారీ పై తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లమ్ వెనుక కూర్చుని ఉండగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, తనతో ఇలా అన్నారు "నేను నీకు కొన్ని విషయాలు బోధిస్తాను, వాటి ద్వారా అల్లాహ్ నీకు ప్రయోజనాన్ని కలుగజేస్తాడు." ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా పలికినారు, "ఆయన ఆదేశించిన విషయాలను ఆచరించుటలో మరియు ఆయన నిషేధించిన విషయాలనుండి దూరంగా ఉండుటలో అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు - తద్వారా నీవు ఆయన పట్ల అవిధేయునిగా కాకుండా, విధేయుడైన దాసునిగా ఉంటావు. నీవు గానీ అలా చేస్తే, అల్లాహ్ నిన్ను ఈ ప్రపంచపు ఉపద్రవాలనుండి, పరలోకపు ఉపద్రవాలనుండి కాపాడుతాడు. (ధర్మము, న్యాయము కొరకు) నీవు చేసే కార్యాలలో నీవు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు సహాయపడతాడు." ఒకవేళ నీవు ఏమైనా కావాలని వేడుకో దలుచుకుంటే, అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ వేడుకోకు. ఎందుకంటే, కేవలం ఆయన ఒక్కడు మాత్రమే కోరికలు కోరుకునే వారి అభ్యర్థనలకు స్పందిస్తాడు. మరియు నీవు ఏమైనా సహాయం కావాలని కోరుకో దలుచుకుంటే, అల్లాహ్ ను తప్ప మరి ఇంకెవ్వరినీ సహాయం కొరకు వేడుకోకు. వాస్తవాన్ని బాగా గ్రహించు - ఈ భూమిపై నివసించే వారందరూ కలిసి ఒక చోట సమావేశమై నీకు ఏమైనా ప్రయోజనం కలిగించ దలుచుకుంటే, నీకు ఏమీ ప్రయోజనం కలిగించలేరు, అల్లాహ్ నీ కొరకు పూర్వనిర్దేశము గావించిన ప్రయోజనం తప్ప. అలాగే ఈ భూమిపై నివసించే వారందరూ కలిసి ఒక చోట సమావేశమై నీకు ఏమైనా హాని కలిగించ దలుచుకుంటే, నీకు ఏమీ హాని కలిగించ లేరు, అల్లాహ్ నీ కొరకు పూర్వనిర్దేశము గావించినది తప్ప. అల్లాహ్, తనకున్న అపార జ్ఞానము, వివేకములను అనుసరించి, ఈ విషయాలు 'ఇలాగే జరుగుతాయి' ('ఇలాగే జరగాలి' అని కాదు) అని ముందుగానే పూర్వనిర్దేశము చేసి ఉంచినాడు. అల్లాహ్ పూర్వనిర్దేశము చేసిన దానిలో మార్పు ఏమీ ఉండదు.