ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ ఘడియ సంభవించే నిదర్శనాలలోని పెద్ద నిదర్శనాలను గురించి తెలియ జేస్తున్నారు – ఆ పెద్ద నిదర్శనాలలో ఒకటి సూర్యుడు తూర్పు నుండి గాక పడమర నుండి ఉదయించడం. సూర్యుడు పడమట నుండి ఉదయించడం చూసినపుడు ప్రజలందరూ (అల్లాహ్’ను) విశ్వసిస్తారు. (ప్రళయ ఘడియ నిదర్శనాలు ప్రస్ఫుటమైన) ఆ సమయాన (అల్లాహ్ ను) విశ్వసించుట, లేదా సత్కార్యములు చేయుట, లేదా తాను చేసిన చెడు పనులకు, పాపకార్యాలకు పశ్చాత్తాప పడుట ఒక అవిశ్వాసికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ ఘడియ హఠాత్తుగా వచ్చి పడుతుందని తెలియ జేసారు. ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, ప్రజలు లేచి తమ తమ దైనందిన కార్యాలలో భాగంగా చేస్తున్న పనులను కూడా పూర్తి చేయలేకపోతారు. (తమ చేతిలో ఉన్న పనిని సైతమూ పూర్తి చేయలేరు). ప్రళయ ఘడియ ఎలా సంభవిస్తుందంటే, వస్త్రాలను అమ్మేవాడూ, కొనే వాడూ, తమ మధ్య వస్త్రాలను పరచనూ లేరు, పరిచి ఉన్న వస్త్రాలను మడత పెట్టనూ లేరు. తన ఆడ ఒంటె నుండి అప్పుడే పితికిన పాలను ఆ వ్యక్తి త్రాగను కూడా త్రాగలేడు (అంత హఠాత్తుగా సంభవిస్తుంది ప్రళయ ఘడియ). నీటి తొట్టెను తయారు చేస్తున్న వ్యక్తి, దానిని పూర్తి చేయనూ లేడు. చేతిలో అన్నం ముద్ద పట్టుకుని ఉన్న వ్యక్తి నోటి వరకు ఆ అన్నం ముద్ద చేరను కూడా చేరదు (అంత హఠాత్తుగా సంభవిస్తుంది ప్రళయ ఘడియ).