మహోన్నతుడు, పరమ పవిత్రుడైన అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై తన ఈ వాక్కును అవతరింపజేసినప్పుడు: {ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే!} సృష్టిపరంగా, అధికారం పరంగా, నియంత్రణ మరియు పర్యాలోచన పరంగా. {మరియు మీరు మీ మనస్సులలో ఉన్నది} అంటే మీ హృదయాలలో ఉన్నది, {వెలిబుచ్చినా} అంటే బహిర్గతం చేసినా లేదా గోప్యంగా ఉంచినా, {లేదా దానిని దాచినా} అంటే రహస్యంగా ఉంచినా లేదా మీ హృదయాలలో దాచిపెట్టినా, {అల్లాహ్ మీ నుంచి దాని లెక్క తీసుకుంటాడు} ప్రళయదినాన. {ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు} తన అనుగ్రహం మరియు కారుణ్యంతో, {మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు} తన న్యాయంతో, {మరియు అల్లాహ్ ప్రతి వస్తువుపై శక్తి గలవాడు} ఆయనను ఏదీ అసమర్థునిగా చేయలేదు. సహాబాలు దానిని విన్నప్పుడు, అది వారికి చాలా భారంగా తోచింది; ఎందుకంటే దానిలో హృదయంలో మెదిలే ఆలోచనలపై కూడా పట్టు ఉంటుందని ఉంది. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి, (ఆయన ఎదురుగా) మోకాళ్ళపై కూర్చొని ఇలా విన్నవించుకున్నారు: “ఓ రసూలుల్లాహ్! ఇంతకు ముందు మాపై, మేము నిర్వర్తించగల శారీరక ఆచరణలే మోపబడ్డాయి; ఉదాహరణకు నమాజ్, ఉపవాసాలు, జిహాద్ మరియు దానధర్మాలు. కాని ఇప్పుడు మీపై ఈ ఆయతు అవతరించింది, మరియు మేము దానిని పూర్తి చేయలేము.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు: “యూదులు మరియు క్రైస్తవులు చెప్పినట్లుగా మీరు కూడా: {మేము విన్నాము మరియు అవిధేయత చూపాము} అని చెప్పాలని అనుకుంటున్నారా? దానికి బదులుగా ఇలా చెప్పండి: {మేము విన్నాము మరియు విధేయులం అయ్యాము. ఓ మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్ధిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే.}” సహాబాలు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని ఆదేశానికి స్పందించి, ఇలా అన్నారు: “మేము విన్నాము మరియు విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్ధిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే.” ముస్లింలు తమ నోళ్ళతో దాన్ని పలికి, వారి ఆంతర్యాలు దానికి లొంగిపోయినప్పుడు; ప్రవక్త మరియు ఆయన సమాజమును ప్రశంసిస్తూ అల్లాహ్ ఈ వచనమును అవతరింపజేశాడు: {آمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَالمُؤْمِنُونَ} మరియు వారి నోళ్ళు మరియు హృదయములు అల్లాహ్ ఆజ్ఞకు లొంగిపోయాయి. {వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము.} అంతేకాక, మేము వారందరినీ విశ్వసిస్తాము. {మరియు వారు ఇలా అన్నారు: మేము} నీ మాటను {విన్నాము} మరియు నీ ఆజ్ఞకు {విధేయులం అయ్యాము}. మేము {మా ప్రభూ నీ క్షమాభిక్షను} మరియు నీ మన్నింపును అర్ధిస్తున్నాము. {మరియు కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే}, తీర్పు దినాన తిరిగి రావలసిన చోటు కూడా నీ వద్దకే. వారు అలా చేసి, అల్లాహ్ ఆజ్ఞలను వింటూ, విధేయత చూపుతూ, చెప్పమని ఆజ్ఞాపించబడిన దానిని చెప్పినప్పుడు; అల్లాహ్ ఈ సమాజంపై భారాన్ని తగ్గించి, ఆ ఆయతును తన ఈ మాటతో రద్దు చేశాడు: {అల్లాహ్ ఏ ప్రాణిపై కూడా దాని శక్తికి మించిన భారాన్ని మోపడు}, అనగా దాని శక్తి, సామర్థ్యం మరియు ప్రయత్నం మేరకు మాత్రమే (మోపుతాడు). {దానికి} తాను సంపాదించిన మరియు చేసిన మంచికి ప్రతిఫలం (పుణ్యం) లభిస్తుంది, {మరియు దానిపై} తాను చేసిన పాపానికి మరియు అపరాధానికి శిక్ష పడుతుంది. మరియు అల్లాహ్ ఒకరి పాపానికి మరొకరిని శిక్షించడు, అలాగే ఒకరి మనస్సులో మెదిలే (చెడు) ఆలోచనలకు కూడా శిక్షించడు. {رَبَّا لَا تُؤَاخِذْنَا} అంటే మమ్మల్ని శిక్షించకు, {إِنْ نَسِينَا} అంటే మేము గుర్తుంచుకోలేకపోయినా, {أَوْ أَخْطَأْنَا} అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా మరచిపోయి సరైన మార్గాన్ని వదిలేసినా. అప్పుడు అల్లాహ్ వారి ఈ ప్రార్థనను స్వీకరించి ఇలా పలికాడు: సరే, నేను అంగీకరించాను. {ఓ మా ప్రభూ! మాపై భారం మోపకు} అంటే కష్టాన్ని, బరువును, {పూర్వం వారిపై మోపినట్లు} అంటే బనీ ఇస్రాయీల్ మరియు ఇతరులపై. దానికి అల్లాహ్ సమాధానమిస్తూ ఇలా అన్నాడు: అవును, నేను అలా చేశాను. {ఓ మా ప్రభూ! మేము సహించలేని భారం మాపై వేయకు} అంటే మేము మోయలేని విధులు, పరీక్షలు మరియు ఇతర విషయాల భారం. అల్లాహ్ ఇలా అన్నాడు: అవును, నేను అలా చేశాను. {మమ్మల్ని మన్నించు} అంటే మా పాపాలను మా నుండి తుడిచివేయి, {మమ్మల్ని క్షమించు} అంటే మా పాపాలను మాపై కప్పిపుచ్చి, వాటిని ఉపేక్షించు, {మమ్మల్ని కరుణించు} నీ అపారమైన కరుణతో. {నీవే మా సంరక్షకుడవు} మరియు మా యజమానివి; {కావున మాకు సహాయం చేయి} సాక్ష్యాలను స్థాపించడం మరియు ఆధిపత్యం ద్వారా {సత్యతిరస్కారులకు విరుద్ధంగా} వారితో చేసే పోరాటంలో మరియు ధర్మయుద్ధంలో . అప్పుడు అల్లాహ్ సమాధానమిచ్చి, ఇలా అన్నాడు: అవును, నేను అలా చేశాను.