ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: అల్లాహ్ ఇస్లాంను వంకరటింకరలు లేని ఒక విశాలమైన మరియు సూటియైన రహదారి (రాచమార్గము) తో పోల్చినారు. ఆ మార్గానికి ఇరువైపులా రెండు ఎత్తైన గోడలున్నాయి, లేక ఆ మార్గము రెండు ఎత్తైన గోడలతో పరివేష్టించబడి ఉన్నది. అవి రెండూ అల్లాహ్ విధించిన హద్దులు. ఆ రెండు గోడలలో అనేక తెరువబడి ఉన్న తలుపులు ఉన్నాయి. అవి అల్లాహ్ నిషేధాలు. ఆ తలుపులపై తెరలు వేయబడి ఉన్నాయి. ఆ తెరలు రహదారిపై వెళుతున్న వ్యక్తికి లోన ఎవరున్నారో (లేక ఏమి ఉన్నదో) కనిపించ నీయవు. ఆ రహదారి ప్రవేశం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఉంటాడు, అతడు ప్రజలను పిలుస్తూ, వారికి సూచనలిస్తూ, మార్గదర్శకత్వం చేస్తూ వారితో ఇలా అంటాడు ‘దారికి ఇరువైపులా ఎటు వైపునకూ వంగకుండా తిన్నగా నడుస్తూ ఉండండి’. ఆ దాయీ (పిలిచే వాడు) అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము. ఆ రహదారికి చివరన మరొక దాయీ ఉంటాడు. ఆ దాయీ, ఆ మార్గమున పోతూ ఉండే బాటసారి దానికి ఇరువైపులా ఉండే తలుపుల పై తెరలలో దేనినైనా ఏ కొద్దిగా తెరెవడానికి ప్రయత్నించినా అతనితో ఇలా అంటాడు: “నీ పాడు గాను! దానిని తెరువకు. తెరిచావో నీవు దానిలోనికి ప్రవేశిస్తావు, ప్రవేశించకుండా నిన్ను నీవు ఆపుకోలేవు”. ఈ దాయీ ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క మందలింపు మరియు హెచ్చరిక.