ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితకాలములోనూ మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత వచ్చిన ఖులఫా-ఎ-రాషిదీన్’ల కాలములోనూ ముస్లిములు, ప్రతి చిన్నవారి తరఫు నుండి (ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ప్రతి ఒక్కరి తరఫు నుండి), ప్రతి పెద్దవారి తరఫు నుండి (స్త్రీ పురుషులలో ప్రతి ఒక్కరి తరఫు నుండి) ఒక ‘సా’ ఆహార దాన్యాన్ని జకాతుల్ ఫిత్ర్’గా చెల్లించేవారు. బార్లీ, ఎండిన ద్రాక్ష (ఎండుద్రాక్ష), వెన్న (అఖ్త్), మరియు ఖర్జూరాలు ఆ ప్రజల ప్రధాన ఆహారంగా ఉండేవి. నాలుగు ‘ముద్’లు ఒక ‘సా’ కు సమానము. ఒక ఎదిగిన వ్యక్తి దోసిలి నిండా పట్టినంత పరిమాణాన్ని ఒక ‘ముద్’ అంటారు. (‘సా’ మరియు ‘ముద్’ అనేవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో ధాన్యము మొదలైన వాటిని కొలవడానికి అమలులో ఉన్న కొలమానాలు) ముఆవియా (రదియల్లాహు అన్హు) ఖలీఫాగా మదీనాకు వచ్చినపుడు సిరియాలో గోధుమలు విరివిగా వాడుకలో ఉండేవి. ప్రజలను సంబోధిస్తూ ఇచ్చిన ప్రసంగములో ఆయన “రెండు ‘ముద్’ల సిరియా గోధుమలు, ఒక ‘సా’ ఖర్జూరాలకు సమానము అని నేను భావిస్తున్నాను” అన్నారు. ప్రజలు దానిని అంగీకరించి దానిపైనే అమలు చేయడం ప్రారంభించినారు. అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నేను మాత్రం జీవించి ఉన్నంత కాలం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో ఏ విధంగా జకాతుల్ ఫిత్ర్ చెల్లిస్తూ వచ్చానో, అదే విధంగా చెల్లిస్తాను.”