ఎడారి వాసులలో నుండి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తనను స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఏదైనా ఆచరణను సూచించమని అడగడానికి వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి – స్వర్గములోనికి ప్రవేశించుట మరియు నరకాగ్ని నుండి విముక్తి పొందుట అనేది ఇస్లాం యొక్క మూలస్థంభములను ఆచరించుటపై ఆధారపడి ఉంటుంది; వాటిలో ఒకటి అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట, మరియు ఆయనకు ఎవరినీ సాటి కల్పించకుండా ఉండుట; రాత్రీ మరియు పగటి పూటలలో అల్లాహ్ తన దాసులపై విధిగావించిన ఐదు నమాజులను నెలకోల్పటం; అల్లాహ్ నీపై విధిగావించిన జకాతును అర్హులైన వారికి తప్పనిసరిగా చెల్లించుట; రమజాన్ మాసపు ఉపవాసాల ఆచరణను వాటి కొరకు విధిగావించబడిన సమయములోనే ఆచరించుట. అది విని ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉన్నదో ఆయన సాక్షిగా, మీ నుంచి నేను విన్నటువంటి విధిగావించబడిన ఆరాధనలకు ఒక్కటి కూడా ఎక్కువ కలుపను, అలాగే వాటి నుండి ఒక్కటి కూడా తక్కువ చేయను.” అతడు అక్కడి నుండి బయలుదేరిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే స్వర్గవాసులలో ఒక వ్యక్తిని చూడటానికి ఇష్టపడతారో, వారు ఈ ఎడారి నివాసిని చూడండి.”