ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు (భవిష్యవాణిగా ముందుగానే) తెలియజేసినారు – మరునాటి ఉదయం తాను ఏ వ్యక్తి చేతికైతే, సైన్యము తన చిహ్నంగా చేసుకునే జెండాను ఇవ్వబోతున్నాడో, అతని చేతిపై ముస్లిములు ఖైబర్ యూదులపై విజయాన్ని పొందబోతున్నారు అని. ఆ వ్యక్తి యొక్క లక్షణాలలో ఉన్న విషయం ఏమిటంటే - అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అలాగే అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతన్ని ప్రేమిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు విని సహాబాలు – ఎవరి చేతికి ఆ జెండా ఇవ్వబడుతుంది అనే విషయం పై మాట్లాడుకుంటూ, వాదులాడుకుంటూ – ఆ గొప్ప గౌరవం తమకే దక్కాలని కోరుకుంటూ – ఆ రాత్రి గడిపారు. ఉదయం అవుతూనే వారందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు, (ప్రతి ఒక్కరూ) ఆ గొప్ప గౌరవం తనకే దక్కాలని కోరుకుంటూ. వారిని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ను గురించి అడిగారు. వారు: “ఆయన అనారోగ్యంగా ఉన్నారు, కంటి సమస్యతో బాధపడుతున్నారు” అని చెప్పారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజియల్లాహు అన్హు కోసం కొందరిని పంపారు; వారు ఆయనను తీసుకువచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పవిత్ర లాలాజలాన్ని అలీ కళ్ళలో వేసి, ఆయన కోసం దుఆ చేసినారు. దానితో అలీ రజియల్లాహు అన్హు కు అసలేమీ నొప్పి లేనట్లుగా అయి, ఆ అనారోగ్యం నయమైంది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు; శత్రువుల కోటను చేరుకునే వరకు స్థిరంగా కొనసాగమని ఆదేశించారు, అలాగే ఇస్లాంలోకి ప్రవేశించే అవకాశాన్ని వారికి ఇవ్వమని ఆదేశించారు. ఒకవేళ వారు ఆయనకు సానుకూలంగా సమాధానం ఇస్తే, ఇస్లాంలో వారు ఏ ఏ విధులు నిర్వర్తించాలో చెప్పమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు సూచించారు. అప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వైపునకు ఆహ్వానించడం యొక్క ఘనతను, గొప్పతనాన్ని అలీ రజియల్లాహు అన్హు కు వివరించారు. ఒక వ్యక్తిని ఇస్లాం వైపునకు మార్గదర్శకం చేయడానికి, మరియు అతడు ఇస్లాం స్వీకరించేందుకు, ఆ ఆహ్వానించిన వ్యక్తి కారణమైతే, అది అరబ్బుల యొక్క అత్యంత విలువైన సంపద అయిన ఎర్ర ఒంటెలను కలిగి ఉండటం మరియు వాటిని స్వంతం చేసుకోవడం లేదా దానం చేయడం కంటే కూడా అతనికి మంచిది.