అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైనిక దళాన్ని పంపినారు, అన్సార్లలోని ఒక వ్యక్తిని వారిపై నాయకుడిగా నియమించారు. మరియు అతనికి విధేయత చూపమని వారికి ఆదేశించారు. ఒకసారి అతనికి కోపం వచ్చి, ఇలా అన్నాడు: "నాకు విధేయత చూపమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని ఆదేశించలేదా?" వారు, "అవును" అని అన్నారు. అప్పుడు అతను, "నా కోసం కట్టెలు సేకరించండి" అని అన్నాడు. వారు సేకరించారు. ఆపై, "అగ్నిని రాజేయండి" అని అన్నాడు. వారు రాజేశారు. ఆ తర్వాత, "దానిలో ప్రవేశించండి" అని అన్నాడు. వారు అందులో ప్రవేశించడానికి సిద్ధపడగా, ఒకరినొకరు పట్టుకుంటూ, "మేము అగ్ని నుండి తప్పించుకోవడానికే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది" అని అన్నారు. అగ్ని ఆరిపోయి, అతని కోపం చల్లారే వరకు వారు అలాగే ఉండిపోయారు. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చేరినప్పుడు, ఆయన ఇలా సెలవిచ్చారు: «ఒకవేళ వారు దానిలో ప్రవేశించి ఉంటే, ప్రళయదినం వరకు దాని నుండి బయటకు వచ్చేవారు కాదు; విధేయత అనేది కేవలం ధర్మబద్ధమైన (మంచి) విషయాలలో మాత్రమే చూప వలసి ఉంటుంది». ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైన్యాన్ని పంపినారు. వారిపై అన్సార్లలోని ఒక వ్యక్తిని నాయకుడిగా నియమించి, అతనికి విధేయత చూపమని వారిని ఆదేశించారు. ఒక సందర్భంలో ఆ నాయకుడికి వారిపై కోపం వచ్చి, వారితో ఇలా అన్నాడు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు విధేయత చూపమని మిమ్మల్ని ఆదేశించలేదా? వారు "అవును" అని పలికారు. అప్పుడు ఆయన, "నేను మిమ్మల్ని కట్టెలు పోగుచేసి, నిప్పు రాజేసి, ఆపై అందులో ప్రవేశించమని ఆజ్ఞాపిస్తున్నాను" అని అన్నారు. వారు కట్టెలు పోగుచేసి నిప్పు రాజేశారు. కానీ, అందులో వారు ప్రవేశించకుండా ఆగి పోయి, ఒకరినొకరు చూసుకోసాగారు. మరియు వారు ఇలా (తమలో తాము) పలికారు: "మేము నరకాగ్ని నుండి తప్పించుకోవటానికే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించాము, మరి మేము అందులో ప్రవేశించాలా?" వారు అలా చర్చించుకుంటూ ఉండగా ఆ అగ్ని జ్వాల ఆరిపోయింది, మరియు ఆ నాయకుడి కోపమూ చల్లారి పోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దాని గురించి తెలిపినపుడు, ఆయన ఇలా అన్నారు: ఒకవేళ వారు అతడికి విధేయత చూపి, తాము వెలిగించిన ఆ అగ్నిలో ప్రవేశించిన ఉంటే, వారు అందులో శిక్షించబడి ఉండేవారు మరియు దాని నుండి శాశ్వతంగా బయటకు వచ్చేవారు కాదు. సృష్టికర్త (అల్లాహ్)కు అవిధేయత కలిగించే విషయంలో, సృష్టికి (మానవులకు) విధేయత చూపకూడదు. విధేయత అనేది కేవలం ధర్మబద్ధమైన (మంచి) విషయాలలో మాత్రమే తప్పనిసరి, అవిధేయత కలిగించే విషయంలో కాదు.

explain-icon

Benefits from the Hadith

  • విధేయత అనేది సత్కార్యాలలో మాత్రమే ఉంటుంది మరియు పాపకార్యాలలో ఉండదు, ఆజ్ఞాపించే నాయకుడికి విధేయత చూపడం తప్పనిసరి అయినప్పటికీ.
  • ఏకదైవారాధకుడై (తౌహీద్‌ను కలిగి ఉండి), పాపాలు చేసిన వ్యక్తికి నరకాగ్ని శిక్ష విధించబడుతుంది. అయితే, అల్లాహ్ తలుచుకుంటే అతడిని క్షమించవచ్చు కూడా.
  • యుద్ధ యాత్రలలో (దండయాత్రలలో) నాయకుడిని నియమించడం చట్టబద్ధమైన విషయము - అలాగే ప్రయాణాలలో కూడా (నాయకుడిని నియమించడం చట్టబద్ధమైన విషయము).