ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తీర్పు దినము నాడు మృత్యువు ఒక గొర్రెపోతు రూపములో ముందుకు తీసుకు రాబడుతుంది అని, అది నలుపు, తెలుపు రంగులలో ఉంటుంది – అని తెలియ జేస్తున్నారు. అపుడు “ఓ స్వర్గవాసులారా!” అను ఎలుగెత్తి పిలువ బడుతుంది. వారు తమ తలలు పైకెత్తి, మెడలను సారించి అటువైపునకు చూస్తారు. (ఆ పిలిచిన వాడు మృత్యువును చూపిస్తూ) “ఇదేమిటో మీకు తెలుసా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును, తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే వారు అందరూ దానిని (అంతకు ముందు) చూసినవారే, దానిని ఎరిగినవారే. అపుడు ఆ పిలిచేవాడు “ఓ నరకవాసులారా!” అని పిలుస్తాడు. వారు తమ తలలు పైకెత్తి, మెడలను సారించి అటువైపునకు చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును, తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే వారు అందరూ దానిని (అంతకు ముందు) చూసినవారే, దానిని ఎరిగినవారే. అపుడు దానిని (మృత్యువును) జిబహ్ చేయడం జరుగుతుంది. ఆ పిలిచేవాడు ఎలుగెత్తి ఇలా అంటాడు “ఓ స్వర్గవాసులారా! ఇది (ఈ స్వర్గ నివాసము) మీకు శాశ్వతం, శాశ్వతం, మీకింక చావు లేదు; “ఓ నరకవాసులారా! ఇది (ఈ నరక నివాసము) మీకు శాశ్వతం, శాశ్వతం, మీకింక చావు లేదు”. ఇది స్వర్గ నివాసుల శుభాలలో (అల్లాహ్ తరఫు నుండి) అపారమైన వృద్ధి, అలాగే నరకవాసుల శిక్షలో అపారమైన కాఠిన్యాన్ని గురించి తెలుపు తున్నది. ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ నుండి ఆయతును పఠించినారు. “మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు, కావున వారు విశ్వసించడం లేదు”. ఈ హదీసు ద్వారా – తీర్పు దినము నాడు (ప్రజలు వారి వారి కర్మలను అనుసరించి) స్వర్గవాసులు, నరకవాసులుగా విభజించబడతారు. ప్రతి ఒక్కరూ తమకు ప్రాప్తమైన దాని లోనికి శాశ్వతంగా ప్రవేశిస్తారు. (ఆ దినము) పాపకార్యములు చేసిన వాడు (తాను ఆ కార్యములకు పాల్బడకుండ ఉంటే ఎంత బాగుండును) అని పశ్చాత్తాప పడతాడు, సిగ్గు పడతాడు, కానీ అది ఏమీ అతనికి మంచిని కలుగ జేయదు, అతని శిక్షను ఏమీ తగ్గించదు.