ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా తెలిపినారు: ఒక ముస్లిమ్ తన తోటి ముస్లిమ్ సోదరుడి కోసం చేసే పనులకు తగినట్లుగా అల్లాహ్ అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఈ లోకంలో ఎవరు ఒక విశ్వాసి కష్టాన్ని నివారిస్తారో, లేదా తగ్గిస్తారో, లేదా పూర్తిగా తొలగిస్తారో, తీర్పు దినాన అల్లాహ్ కూడా అతని నుండి ఒక కష్టాన్ని తొలగిస్తాడు. ఎవరైనా కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తే, అల్లాహ్ అతని కష్టాన్ని ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సులభతరం చేస్తాడు. ఎవరైతే ఒక ముస్లిమ్ యొక్క లోపాన్ని దాచిపెడతారో, అంటే ఇతరులకు తెలియకుండా అతడు చేసిన తప్పులను, పొరపాట్లను దాచిపెడతారో, అల్లాహ్ కూడా అతని లోపాలను, తప్పులను, పొరపాట్లను ఈ లోకంలోనూ, పరలోకంలోనూ దాచి పెడతాడు. తన దాసుడు తన తోటి సహోదరుని ధార్మిక, ప్రాపంచిక ప్రయోజనాల్లో సహాయం చేస్తూ ఉన్నంత వరకు, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయంగా ఉంటాడు. ఈ సహాయం దుఆ, ఆచరణలు, సంపద ద్వారా కావచ్చు. ఎవరైనా అల్లాహ్ కోసం ధార్మిక జ్ఞానం సంపాదించేందుకు ప్రయాణిస్తారో, అల్లాహ్ అతని కొరకు స్వర్గం దారిని సులభతరం చేస్తాడు. అల్లాహ్ ఆరాధనా గృహాలలో (మస్జిదులలో) ఒక సమూహం అల్లాహ్ యొక్క గ్రంథాన్ని (ఖుర్ఆన్) పఠిస్తూ, పరస్పరం అధ్యయనం చేస్తూ ఉంటే, వారిపై ప్రశాంతత వర్షిస్తుంది; అల్లాహ్ కరుణ వారిని ఆవరిస్తుంది; దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు; అల్లాహ్ ఆ సమూహం గురించి తన సమీపంలో ఉన్న వారి వద్ద ప్రశంసిస్తాడు. అల్లాహ్ తన దాసుడిని పరమోన్నతమైన సంఘంలో ప్రస్తావించడం ఎంత గొప్ప గౌరవమో కదా! ఎవరి వద్ద మంచి పనులు తక్కువగా ఉంటాయో, అతను ఎక్కువ మంచి పనులు చేసిన వారి స్థాయికి చేరుకోలేడు. కాబట్టి, స్వయంగా మంచి పనులు చేయకుండా తన వంశము, కులము పేరు మీద ఆధారపడకూడదు.