ఇద్దరు వ్యక్తులను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించబడినది; ఒకరు అమిత భక్తి పరుడు, మరొకరు ధర్మపండితుడు (ఆలిమ్). ఆ ఇద్దరిలో ఎవరు ఉత్తములు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించడం జరిగింది? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “షరియత్ యొక్క అన్ని శాస్త్రముల ధార్మిక ఙ్ఞానమును కలిగి ఉండి, దానిపై ఆచరిస్తూ, మరియు ఆ ఙ్ఞానాన్ని ఇతరులకు బోధించే ధర్మపండితుని శ్రేష్ఠత మరియు ఘనత; తాను ఆచరించే ఆరాధనను సక్రమంగా ఆచరించడానికి అవసరమైన ఙ్ఞానాన్ని మత్రమే కలిగి ఉన్న అపర దైవ భక్తుని పై ఎటువంటిది అంటే; మీలోని ఒక సాధారణ వ్యక్తిపై నా యొక్క శ్రేష్టత మరియు గౌరవమును పోలినటువంటిది.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ గొప్పతనానికి కారణాన్ని వివరించారు: “ఇది ఎందుకంటే, నిశ్చయంగా పరమపవిత్రుడైన అల్లాహ్ మరియు దైవదూతలలో ఆయన సింహాసనాన్ని మోసే దూతలు; అలాగే దైవదూతలందరిలో ఆకాశాలాలో నివాసం ఉండేవారు మరియు భూనివాసులు, అంటే మానవులు, జిన్నాతులు, పశుపక్ష్యాదులన్నీ చివరకి భూమి లోపల లోతైన తన రంద్రములో నివసించే చీమ, మరియు సముద్రములోని చేపలు – అంటే భూచరాలు, జలచరాలు అన్నీ – ఇవన్నీ, ప్రజలకు ఎందులోనైతే మోక్షము మరియు సాఫల్యము ఉన్నదో అటువంటి ఙ్ఞానాన్ని బోధించే గురువు యొక్క మంచి కొరకు, అతనికి శుభం కలగాలని ప్రార్థిస్తాయి.