ముఆవియా ఇబ్న్ అబీ సుఫ్యాన్ రజియల్లాహు అన్హుమా ఒకసారి, కొద్దిమంది సహాబాలు వృత్తాకారంలో కూర్చుని ఉండగా వారి వద్దకు వెళ్ళి దేని కొరకు అలా సమావేశమయ్యారని ప్రశ్నించారు. వారు “అల్లాహ్ యొక్క స్మరణ కొరకు కూర్చున్నాము” అని బదులిచ్చారు. అపుడు ఆయన రజియల్లాహు అన్హు అక్కడ అలా గుమిగూడి కూర్చోవడం కేవలం అల్లాహ్ యొక్క స్మరణ కొరకు మాత్రమే తప్ప మరింకేమీ కాదు అని వారితో ప్రమాణం చేయించినారు. వారు ఆ విధంగా ప్రమాణం చేసినారు. అప్పుడు ఆయన వారితో : “నేను మీతో ప్రమాణం చేయించింది మిమ్ములను అనుమనించో, లేక మీ సత్యసంధతను శంకించో కాదు” అని పలికి, వారికి ఇలా తెలియజేసినారు – సహాబాలలో తనంత సన్నిహితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ఇంకెవ్వరూ లేరనీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య ఉమ్మె హబీబహ్ రజియల్లాహు అన్హా తన సహోదరి అనీ, అంతేగాక ‘కాతిబ్ అల్ వహీ’ లలో (ఖుర్’ఆన్ అవరణ జరుగుతుండగా గ్రంథస్థం చేసిన వ్రాయసకారులలో) తాను ఒకడినని – అయినప్పటికీ తాను చాలా కొద్ది హదీథులను మాత్రమే ఉల్లేఖించినానని తెలియజేసినారు. తరువాత ఆయన వారితో “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటినుండి బయటకు వచ్చినారు. వారి చూపు అక్కడ మస్జిదులో వృత్తాకారములో కూర్చుని ఉన్న కొంతమంది సహాబాలపై పడింది. వారు, తమను ఇస్లాం వైపు నడిపించినందుకు, తమపై తన అనుగ్రహాలను కురిపించినందుకు అల్లాహ్ ను స్మరిస్తున్నారు, ఆయనను కొనియాడుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబాలను, ముఆవియహ్ రజియల్లాహు అన్హు తన అనుచరులను ప్రశ్నించిన మాదిరిగా ప్రశ్నించినారు, ఆయన వారితో ప్రమాణం చేయించిన మాదిరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రమాణం చేయించినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబాలకు తాను ఆ విధంగా వారిని ప్రశ్నించడం మరియు వారితో ప్రమాణం చేయించడం వెనుక ఉన్న కారణాన్ని తెలియజేసినారు – దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం తన వద్దకు వచ్చినారని, సర్వోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అలాహ్ మిమ్ములను గురించి తన దైవదూతల ముందు గర్వపడుతున్నడని, మీ ఘనతలను, మీ సత్కార్యాలను వారికి చూపుతున్నాడని, వారి ఎదుట మిమ్ములను పొగుడుతున్నాడని జిబ్రయీల్ అలైహిస్సలాం తనకు సమాచారమిచ్చినారని వారికి తెలియజేసినారు.