ఈ హదీసులో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - జిల్ హిజ్జహ్ మాసపు మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు, సంవత్సరములోని మిగతా దినాలలో చేసే సత్కార్యాలకన్నా కూడా ఉత్తమమైనవి అని తెలియజేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు ఆయనను ఈ పది దినములలో కాక మిగతా దినములలో చేసే జిహాదును గురించి ప్రశ్నించడం జరిగింది – మిగతా దినములలో చేసే జిహాదు ఉత్తమైనదా, లేక ఈ పది దినములలో చేసే సత్కార్యాలు ఉత్తమమైనవా అని; నిజానికి, (దీనికి పూర్వమే) వారికి జిహాదు అత్యుత్తమమైన ఆచరణలలో ఒకటి అని పలుమార్లు (నిర్ధారణగా) బోధించడం జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విధంగా జవాబు ఇచ్చినారు: “ఈ పది దినములలో చేసే సత్కార్యాలు, మిగతా దినములలో చేసే జిహాదు కన్నా కూడా ఉత్తమమైనవి – అయితే, (మిగతా దినములలో చేసే జిహాదులో) కేవలం అల్లహ్ కొరకు తన ప్రాణాన్ని, తన ధనాన్ని పణంగా పెట్టి జిహాదులో పాల్గొని, తన ధనాన్ని కోల్పోయి (జిహాదు కొరకు తన ధనాన్ని ఆసాంతం అల్లాహ్ కొరకు ఖర్చు చేసి), తన ప్రాణాన్ని కూడా అల్లాహ్ మార్గములో ధారపోసిన వాని జిహాదు తప్ప.” ఈ పది దినములలో సత్కార్యాలు చేసే వాడు అంత గొప్ప ప్రతిఫలాన్ని పొందే వాడై ఉంటాడు.