అబూబక్ర్ అస్’సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: ప్రజలు ఖుర్’ఆన్ యొక్క ఈ ఆయతును పఠిస్తారు: {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنْفُسَكُمْ لاَ يَضُرُّكُمْ مَنْ ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ} [المائدة: 105]. [ఓ విశ్వాసులారా! మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనుక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే, దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించలేరు.....] (సూరహ్ అల్ మాఇదహ్ 5:105) ఆ ఆయతును పఠించడం ద్వారా వారు – తమ గురించి తాము జాగ్రత్తపడితే చాలునని (అంటే తాము సంస్కారవంతంగా ఉంటే చాలునని); తాము సరియైన మార్గములో నడిస్తే చాలునని, ఆ తర్వాత మార్గభ్రష్ఠుడైన వాని మార్గభ్రష్ఠత్వము వల్ల తమకు నష్టం గానీ, కీడుగానీ జరుగదని; మంచి చేయమని ఆఙ్ఞాపించవలసిన అవసరం, చెడును నిషేధించవలసిన అవసరం తమకు లేదని అర్థం చేసుకుంటారు. కనుక అబూబక్ర్ అస్’సిద్దీఖ్ రజియల్లాహు అన్హు దాని అర్థము అది కాదు అని, తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా విన్నాను అని వారికి తెలియజేస్తున్నారు: ప్రజలు అణచివేతదారుడిని చూసి కూడా అతడిని అణచివేతకు, దౌర్జన్యానికి పాల్బడుట నుండి నిరోధించే శక్తి, సామర్థ్యము ఉండి కూడా అతడిని నిరోధించకపోతే, అల్లాహ్ తన తరఫు నుండి ప్రతి ఒక్కరినీ శిక్షించే అవకాశం ఉంది, తప్పు చేసిన వానిని మరియు దాని గురించి మౌనంగా ఉన్న వానిని కూడా.