ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోని కొంతమంది పేదవారు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: ‘‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ధనవంతులు అన్ని పుణ్యాలూ సంపాదించేసు కుంటున్నారు. వారు మేము చేసేలా నమాజ్ చేస్తారు, మేము ఉండేలా ఉపవాసం ఉంటారు, కానీ వారు తమ అదనపు ధనాన్ని దానం కూడా చేస్తారు, కానీ మేము మాత్రం (బీదరికం వలన) దానం చేయలేము!’’ అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా ఉత్సాహపరిచారు: ‘‘అల్లాహ్ మీకు కూడా దానం చేసే అవకాశాన్ని ఇవ్వలేదు అని అనుకుంటున్నారా? ప్రతిసారి ‘‘సుబహానల్లాహ్’’ (అల్లాహ్ పరమ పవిత్రుడు) అనడం దానం, ప్రతిసారి ‘‘అల్లాహు అక్బర్’’ (అల్లాహ్ గొప్పవాడు) అనడం దానం, ప్రతిసారి ‘‘అల్ హమ్దులిల్లాహ్’’ (అల్లాహ్‌కే సకల స్తుతులు) అనడం దానం, ప్రతిసారి ‘‘లా ఇలాహ ఇల్లల్లాహ్’’ (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అనడం దానం. మంచి పనిని ప్రోత్సహించడం దానం, చెడు పనిని నిషేధించడం కూడా దానం. మీలో ఎవరైనా తన భార్యతో తన కోరిక తీర్చుకుంటే, దానికీ పుణ్యం లభిస్తుంది.’’ దానికి వారు ఆశ్చర్యపడి, ‘‘ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరైనా తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?’’ అని అడిగారు. దానికి ప్రవక్త ఇలా సమాధానమిచ్చారు: ‘‘అతడు అదే కోరికను హరామ్ మార్గంలో తీర్చుకుంటే అతనికి పాపం చుట్టుకుంటుందని మీకు తెలియదా? అలాగే, హలాల్ మార్గంలో తన కోరిక తీర్చుకుంటే, అతనికి పుణ్యం లభిస్తుంది.’’