జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) మక్కా విజయం సంవత్సరములో, ఆ సందర్భముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నపుడు, ఆయన ఇలా అనడం విన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మద్యము, మృత జంతువులు, పందులు, మరియు విగ్రహాల అమ్మకాలను నిషేధించినారు.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి చనిపోయిన జంతువుల కొవ్వును అమ్మడానికి అనుమతి ఉందా? ఎందుకంటే దానిని ఓడలకు పూత పూయడానికి, చర్మాలకు (అవి చెడిపోకుండా) గ్రీజులాగా రాయడానికి, మరియు ప్రజలు తమ దీపాలను వెలిగించడానికి ఉపయోగిస్తారు” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు అది నిషేధము” అన్నారు. ఆ సందర్భముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ యూదులను నాశనం చేసి వారిని శపించాడు. అల్లాహ్ వారిపై పశువుల కొవ్వులను నిషేధించినప్పుడు, వారు దానిని కరిగించి, దానిని అమ్మి, దాని ధరను తిన్నారు.