ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారము నాడు ‘శుక్రవారపు నమాజు’ కొరకు తొందరగా వెళ్ళుట ఎంత ఘనత కలిగిన విషయమో తెలియజేస్తున్నారు. ‘శుక్రవారపు నమాజు’ కొరకు మస్జిదునకు త్వరగా వెళ్ళుట అనేది సూర్యుడు పూర్తిగా ఉదయించిన వెంటనే ప్రారంభమై, ఇమాం మస్జిదులోనికి ప్రవేశించేంత వరకు ఉంటుంది. ఈ సమయం మొత్తం ఐదు ఘడియలుగా ఉంటుంది. సూర్యుడు ఉదయించిన దగ్గరి నుండి ఇమాం మస్జిదులోనికి ప్రవేశించి ప్రసంగము ఇవ్వడానికి ‘మెంబరు’ (ప్రసంగ స్థలము) పై ఆశీనుడు అయ్యే వరకు మధ్యలో ఉన్న సమయం ఐదు భాగాలుగా విభజింపబడుతుంది. మొదటిది: ఎవరైతే ‘జనాబత్ గుస్ల్’ మాదిరిగా సంపూర్ణంగా ‘గుస్ల్’ చేసి (తలస్నానం చేసి), శుక్రవారపు నమాజు కొరకు ప్రత్యేకించబడిన మస్జిదునకు మొదటి ఘడియలో వెళతాడో, అతడు ఒక ఒంటెను (అల్లాహ్ ప్రసన్నత కొరకు) దానం చేసిన వానితో సమానం. రెండవది: ఎవరైతే రెండవ ఘడియలో వెళతాడో, అతడు ఒక ఆవును దానం చేసిన వానితో సమానం. మూడవది: ఎవరైతే మూడవ ఘడియలో వెళతాడో, అతడు కొమ్ములు కలిగిన ఒక మగ పొట్టేలును దానం చేసిన వానితో సమానం. నాలుగవది: ఎవరైతే నాలుగవ ఘడియలో వెళతాడో, అతడు ఒక కోడిని దానం చేసిన వానితో సమానం. ఐదవది: ఎవరైతే ఐదవ ఘడియలో వెళతాడో, అతడు ఒక గుడ్డును దానం చేసిన వానితో సమానం. ఎపుడైతే ఇమాం ‘ఖుత్బాహ్’ (శుక్రవారపు ప్రసంగం) ఇవ్వడానికి మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, మస్జిదు ద్వారముల వద్ద కూర్చుని ఉన్న దైవదూతలు – ఒక్కొక్కరుగా మస్జిదులోనికి ప్రవేశిస్తున్న వారి పేర్లను రాయడం ఆపి – అల్లాహ్ యొక్క స్మరణను, మరియు ప్రసంగాన్ని వినడానికి మస్జిదులోనికి వెళ్ళిపోతారు.