ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సూచించినారు: ఎవరైతే సలాహ్ (నమాజు) కొరకు ముఅజ్జిన్ పలికే అజాన్ పలుకులు వింటే, ఆ అజాన్ పదాలను ముఅజ్జిన్ (పలికిన వెంటనే అతని) వెనుకే తిరిగి వల్లించాలి, “హయ్య అలస్సలాహ్ – హయ్య అలల్ ఫలాహ్” అనే రెండు వాక్యాలు తప్ప. అజాన్ వింటున్న వ్యక్తి ఈ రెండు వాక్యాలు విన్నప్పుడు, “లా హౌల, వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్” అని పలకాలి. అజాన్ పూర్తి అయిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ‘సలవాత్’ (దరూద్) పఠించాలి. ఎందుకంటే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఒకసారి ‘సలవాత్’ పఠిస్తారో, దాని కారణంగా అల్లాహ్ వారికి పదింతలుగా ‘సలవాత్’ ను ప్రసాదిస్తాడు. అల్లాహ్ ‘సలవాత్’ ను ప్రసాదించడం అంటే దాని అర్థము అల్లాహ్ అటువంటి దాసుణ్ణి గురించి తన దైవదూతల మధ్య ప్రస్తావించడం, పొగడడం. తరువాత తనకు ‘వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనమని ఆదేశించినారు. అది ఒక సమున్నతమైన స్థానము. (స్వర్గములోని స్థానములన్నింటిలోనూ) అది అత్యున్నతమైన స్థానము. ఆ స్థానము పొందుటకు ఎవ్వరూ అర్హులు కారు, మరియు ఎవరికీ సాధ్యము కాదు – సర్వోన్నతుడైన అల్లాహ్ దాసులందరిలోను కేవలం ఒక్కరికి తప్ప. (దానిని గురించి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఆ ఒక్కరూ నేను కావాలని నా ఆశ” అని. నిజానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా అనడం వారి వినయాన్ని, అణకువను, నమ్రతను తెలుపుతుంది. ఆ స్థానము పొందడానికి కేవలం ఒక్కరు మాత్రమే అర్హులైనట్లయితే, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాక ఇంకెవరు కాగలరు. ఎందుకంటే సృష్ఠి మొత్తంలో కేవలం ఆయన మాత్రమే అత్యుత్తముడు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు – ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు 'వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొంటారో, వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసు పొందుతారు.