ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొంతమంది సహాబాలతో కూర్చుని ఉన్నారు, వారిలో అబూబకర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కూడా ఉన్నారు. అంతలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడి అక్కడినుండి బయలుదేరినారు. చాలా సేపటి వరకూ తిరిగి రాకపోయేసరికి శత్రువులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను పట్టుకుని ఉంటారా, లేక ఏమైనా చేసి ఉంటారా అని సహాబాలు భయపడినారు. ఈ ఆలోచనతో సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) భయంతో లేచి నిలబడినారు. అలా భయపడిన వారిలో మొదటి వాడు అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు). ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వెదుకుతూ బనూ నజ్జార్ తెగకు చెందిన ఒన్ అన్సారీ సాహబీ తోట వద్దకు చేరుకున్నాడు. అందులోనికి ప్రవేశించడానికి ఏదైనా దారి ఉందా అని ఆ తోట చుట్టూ తిరిగినాడు. కానీ అతనికి ఏ దారీ కనిపించలేదు. అయితే తోట చుట్టూ ఉన్న గోడలో ఒక చోట చిన్న దారి గుండా నీళ్ళు లోనికి ప్రవేశిస్తూ ఉండడం గమనించినాడు. ఆయన బాగా ఒదిగి ఆ దారి గుండా తోట లోనికి ప్రవేశించి అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను చూచినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిదీ, అబూ హురైరాహ్ నువ్వేనా?” అని ప్రశ్నించినారు. ఆయన “అవును” అన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమైంది?” అని ప్రశ్నించారు. దానికి అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “మీరు మా మధ్యన ఉండినారు. లేచి నిలబడి బయలుదేరి వెళ్ళినారు. ఎంతసేపైనా మీరు తిరిగి రాలేదు. మీతో సంబంధం తెగిపోతుందేమో అని భయపడినాము. అలా భయపడిన వారిలో నేను మొదటి వాడిని. అలా మిమ్మల్ని వెదుకుతూ ఈ తోట గోడ వద్దకు చేరుకున్నాను, బాగా ఒదిగి పోయి నక్క మాదిరిగా ఇందులోనికి ప్రవేశించినాను. మిగతా వారు నావెనుక వస్తున్నారు.” అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన సత్యవంతుడని సంకేతంగా, గుర్తుగా ఆయనకు తన పాదరక్షలు ఇచ్చినారు – (అక్కడి నుండి బయలుదేరిన తరువాత అబూ హురైరాహ్ ఇతరులకు చెప్పబోయేదంతా నిజమే అనడానికి తన గుర్తుగా, సూచనగా). తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనతో ఇలా అన్నారు: “ఈ నా పాదరక్షలతో తిరిగి వెళ్ళండి, ఈ గోడ అవతల – “అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు, అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వంతో సాక్ష్యము పలికే ఎవరిని కలిసినా, అతనిలో ఈ గుణవిశేషణాలు ఉంటే, అతడు స్వర్గ నివాసులలో ఒకడు అనే శుభవార్తను అతనికి వినిపించు.” అక్కడినుండి బయలుదేరిన తరువాత అబూ హురైరాహ్ మొట్టమొదట కలిసిన వ్యక్తి ఉమర్ (రదియల్లాహు అన్హు). ఆయన “ఈ పాదరక్షలు ఏమిటి, ఓ అబూ హురైరాహ్?” అని ప్రశ్నించినారు. దానికి ఆయన “ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పాదరక్షలు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వీటిని నాకిచ్చి పంపించినారు - “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వంతో సాక్ష్యము పలికే ఎవరిని కలిసినా అతనికి స్వర్గప్రవేశపు శుభవార్త వినిపించమని” అని జవాబిచ్చినాడు. అది విని ఉమర్ (రదియల్లాహు అన్హు), అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఛాతీ పై బలంగా మోదినారు, దానితొ ఆయన వెల్లకిలా పడిపోయినారు. ఉమర్ రదియల్లాహు అన్హు “వెనుదిరిగి వెళ్ళు, ఓ అబూ హురైరహ్” అన్నారు. అబూ హురైరహ్ ఇలా అన్నారు “నేను వెనుదిరిగి భయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి వద్దకు వెళ్ళినాను. నేను ఏడుస్తూ ఉన్నాను. ఉమర్ (రదియల్లాహు అన్హు) నా వెనుకనే నడుచుకుంటూ వచ్చినారు.” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఏమైంది నీకు ఓ అబూ హురైరాహ్?” అని ప్రశ్నించినారు. నేను “నేను మొదటగా ఉమర్ (రదియల్లాహు అన్హు)ను కలిసినాను. మీరు ఏమి చెప్పమన్నారో అది ఆయనకు చెప్పినాను. ఆయన నా ఛాతీ పై బలంగా మోదినారు, నేను వెల్లకిలా పడిపోయినాను. ఆయన “వెనుదిరిగి వెళ్ళు” అన్నారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎందుకు అలా చేసారు ఓ ఉమర్?” అని ప్రశ్నించినారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు “నా తల్లిదండ్రులు మీకొరకు త్యాగం చేయబడుదురుగాక ఓ ప్రవక్తా! మీరు అబూ హురైరహ్ కు మీ పాదరక్షలనిచ్చి పంపించినారా - “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వంతో సాక్ష్యము పలికే ఎవరిని కలిసినా అతనికి స్వర్గప్రవేశపు శుభవార్త వినిపించమని?” అని అడిగినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అవును” అన్నారు. అపుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) “అలా చేయకండి, ప్రజలు ఈ మాటలపైనే భారం వేసి, ఆచరణలను ఆచరించడం వదిలివేస్తారేమో అని భయంగా ఉంది నాకు” అన్నారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే వారిని అలాగే వదిలివేయండి” అన్నారు.