ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబెర్ పై కూర్చుని తన సహాబాలతో మాట్లాడుతున్నారు, అపుడు వారు ఇలా అన్నారు: “నేను (చని) పోయిన తరువాత, మీ గురించి నేను భయపడే విషయాలలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు అలంకారాలు, దాని ఆనందాలు – మరియు జీవితం ఎంతో స్వల్పమైనది అయినప్పటికీ ప్రజలు గొప్పగా చెప్పుకునే వస్తువులు, దుస్తులు, పంటలు మరియు ఇతర వస్తువులు. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాడు: “ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మొదలైనవి అల్లాహ్ తరఫు నుండి ఆయన అనుగ్రహం మరియు శుభాలు కదా! మరి ఆ శుభాలే వెనుదిరిగి శాపాలుగా, శిక్షలుగా మారుతాయా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా ఉండి పోవడం చూసి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహానికి గురయ్యారేమో అనుకుని అక్కడున్న వారు ఆ ప్రశ్నించిన వానిని మందలించారు. తరువాత అక్కడున్న వారికి – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎదో అవతరిస్తున్నది అన్న విషయం స్పష్టమై పోయింది. కొద్ది సేపటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (వహీ అవతరణ కారణంగా) తన నుదిటికి పట్టిన చెమటను తుడుచుకుని “ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడ?” అని అడిగారు. అతడు: “హాజరుగా ఉన్నాను ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను స్తుతించి, ఆయనకు ప్రశంసలు అర్పించి ఇలా అన్నారు: “నిజమైన మంచితనం మంచితనాన్ని మాత్రమే తీసుకు వస్తుంది. కానీ ఈ ప్రాపంచిక వైభవం, దాని అలంకారం, సౌదర్యము – ఇవి స్వచ్ఛమైన మంచితనం కాదు. ఎందుకంటే దాని ఆకర్షణ, ప్రలోభము, మరియు పోటీ మొదలైనవి సంపూర్ణంగా పరలోక జీవితంపై శ్రద్ధ వహించ కుండా, వాటిలోనే నిమగ్నమై పోయేలా చేస్తాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఒక ఉదాహరణ ద్వారా వివరించినారు: వసంతకాలపు మొక్కలు మరియు ఖదిర్’ని (ఇది ఒక రకమైన మొక్క, దీనిని పశువులు ఇష్టంగా తింటాయి) అధికంగా తినడం వల్ల ఆ మొక్కలు పశువులను చంపవచ్చు లేదా మృత్యువు అంచులకు చేర్చవచ్చు. దీనికి మినహాయింపు – ఖదిర్ తినే పశువు, దాని కడుపు రెండు వైపులా నిండిపోయే వరకు తిని, తరువాత అది సూర్యుని వైపునకు తిరిగి, తన కడుపు నుండి పేడని విసర్జిస్తుంది, లేదా మూత్రవిసర్జన చేస్తుంది. తరువాత అది తన కడుపులో ఉన్న దానిని పైకి తెచ్చి నెమరు వేస్తూ, నమిలిన తరువాత మింగుతుంది, తరువాత మళ్ళీ మేయడం ప్రారంభిస్తుంది. సంపద మధురంగా, పచ్చగా ఆకర్షణీయంగా ఉండే ఒక రకమైన మొక్క లాంటిది. ఆ మొక్క ఒకవేళ చాలా ఎక్కువగా ఉంటే అది ప్రాణం తీయగలదు, లేదా దాదాపు మృత్యువు అంచుల వరకూ తీసుకు వెళ్ళగలదు. నిజానికి సంపద అవసరమైనదే. దానిని ధర్మబధ్ధమైన మార్గములో, కొద్ది మొత్తములో తీసుకుని, అవసరానికి తగినంత మాత్రమే ఉపయోగించినట్లయితే, అది అతనికి ఎటువంటి హాని కలుగజేయదు. ఒక ముస్లిం తన సంపదలో కొద్ది భాగాన్ని పేదలకు, అనాథలకు, సర్వమూ కోల్పోయిన బాటసారులకు పంచినట్లయితే (దానము చేసినట్లయితే), ఆ సంపద అతనికి ఒక మంచి సహచరునిగా మారుతుంది. ఎవరైతే సంపదను ధర్మబద్ధంగా సంపాదించి తనతో ఉంచుకుంటాడో అది అతనికి ఒక వరం లాంటిది. కానీ ఎవరైతే దానిని అధర్మంగా, అధర్మ మార్గాలలో సంపాదిస్తాడో అతడు ఎంత తిన్నా సంతృప్తి చెందని వ్యక్తి లాంటి వాడు. ఆ సంపద తీర్పు దినమున అతనికి వ్యతిరేకంగా సాక్షిగా నిలబడుతుంది.