ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను అడిగారు – పేదవాడు అంటే ఎవరో తెలుసా మీకు అని. దానికి వారు “మాలో పేదవాడు అంటే సంపద గానీ, ఆస్తిపాస్తులు గానీ లేనివాడు” అని జవాబిచ్చారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నా ఉమ్మత్ యొక్క పేదవాడు ఎవరంటే, అతడు పునరుథ్థాన దినమున నమాజులు, ఉపవాసాలు, జకాత్ మరియు దానధర్మాలు వంటి అనేక సత్కార్యాలతో వస్తాడు. కానీ వాటితో పాటు ఒకరిని అవమానపరిచి ఉంటాడు; మరొకరిని దూషించి ఉంటాడు; ఇంకొకరి పట్ల అపవాదులు ప్రచారం చేసి ఉంటాడు; ఒకరి ఆస్తిని తినేసి ఉంటాడు; మరొకరి హక్కును చెల్లించడానికి నిరాకరించి ఉంటాడు; ఒకరి రక్తాన్ని చిందించి అన్యాయం చేసి ఉంటాడు; మరొకరిని అన్యాయంగా కొట్టి అవమానపరిచి ఉంటాడు. పునరుథ్థాన దినమున అతడు అనేక సత్కార్యాలతో పాటు వీటతో కూడా వస్తాడు. ఇతని చేత అణచివేతకు గురైన వానికి ఇతని మంచిపనులలో నుండి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అతని మంచి చెడుల మధ్య న్యాయం పూర్తిగా జరుగక ముందే ఇతని సత్కార్యాలన్నీ అయిపోతే, ఇతని చేత అణచివేతకు గురైన వాని పాపాలలో కొన్ని ఇతని ఖాతాలలో వేయబడతాయి. అపుడు అతడు నరకాగ్నిలోనికి విసిరి వేయబడతాడు. అపుడు అతని పేరున ఒక్క సత్కార్యం కూడా మిగిలి ఉండదు.