ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ విధించిన హద్దులలో నిలిచి ఉండే వారిని గురించి, అల్లాహ్ యొక్క ఆదేశాలపై స్థిరంగా ఉండే వారిని గురించి, మంచిని చేయమని ఆదేశించే వారి గురించి మరియు చెడును నిషేధించే వారి గురించి ఒక (అద్భుతమైన) ఉపమానం ద్వారా వివరిస్తున్నారు. అల్లాహ్ విధించిన హద్దులలో స్థిరంగా నిలిచి ఉండేవారి; మరియు సత్కార్యాలు చేయుటను వదిలి వేసి, దుష్కార్యాలకు, దుర్మార్గానికి పాల్బడేవారి – మరియు వారి కారణంగా సమాజపు ముక్తి మరియు రక్షణలపై పడే ప్రభావముల యొక్క ఉపమానము ఎటువంటిదంటే – ఓడ లోనికి ఎక్కే ముందు ఎవరు ఓడ పై అంతస్థులో కూర్చోవాలి, మరియు ఎవరు ఓడ క్రింది అంతస్థులో కూర్చోవాలి అని లాటరీ వేసుకున్న ప్రజలవంటిది. వారిలో కొందరు ఓడ పై భాగాన కూర్చోవడాన్ని గెలుచుకున్నారు, మరి కొందరు ఓడ క్రింది భాగములో కూర్చోవడాన్ని గెలుచుకున్నారు. క్రింది భాగాన కూర్చొన్న వారు త్రాగు నీటి కొరకు పై భాగానికి వెళ్ళినపుడు, అక్కడ ఉన్న వారిని దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చేది. అందుకని క్రింది భాగములో కూర్చొన్నవారు ఇలా అనుకున్నారు: “ఒకవేళ మనం ఉంటున్న క్రింది భాగములోనే ఒక రంధ్రము చేసుకుంటే, మన పైన ఉన్న వారికి కష్టం కలిగించకుండా అందులో నుంచే మనం నీటిని తీసుకోవచ్చు; ”. ఒకవేళ పైన ఉన్నవారు, క్రింద ఉన్న వారిని అలా చేయడానికి వదిలివేస్తే, వారందరితో పాటు ఓడ పూర్తిగా మునిగి పోతుంది. ఒకవేళ వారు (పైన ఉన్నవారు) లేచి నిలబడి వారిని అలా చేయకుండా వారించి, వారిని అడ్డుకుంటే, అక్కడున్న రెండు సమూహాలు కూడా రక్షించబడతాయి.