ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మహోన్నతుడైన అల్లాహ్’ను ఈ పదములతో స్మరించుట, ఆయనను స్తుతించుట, ఈ ప్రపంచము కంటే, ఈ ప్రపంచములోని విషయాన్నింటి కంటే కూడా ఉత్తమమైన విషయము. ఆ పదాలు ఇవి: “సుబ్’హానల్లాహి”: మహోన్నతుడైన అల్లాహ్ లోపరహితుడు, ఆయన ఔన్నత్యము లోపరహితమైనది. మహిమ, స్తోత్రము, కీర్తి, ప్రకాశము అన్నీ కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి అని అర్థము. “అల్’హందులిల్లాహ్”: ‘సకల ప్రశంసలూ, కృతజ్ఞతలూ ఆయనకే శోభిస్తాయి’ – అంటే, పరిపూర్ణమైన ఆయన నామములు మరియు ఆయన గుణగణములను, ఆయనపై పూర్తి ప్రేమతో, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుట. “లా ఇలాహ ఇల్లల్లాహ్”: ‘అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవ్వరూ లేరు’ “అల్లాహు అక్బర్”: ‘అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు’, సర్వోన్నతుడు, సర్వోత్కృష్టుడు, ప్రతి దాని కంటే కూడా మహోన్నతుడు.