ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్న్ అల్-లుతబియ్యహ్ అనే వ్యక్తిని బనూ సులైమ్ తెగవారి నుండి జకాత్ వసూలు చేసి తీసుకు రావడానికి నియమించినారు. పని ముగించుకుని అతడు మదీనాకు తిరిగి వచ్చినపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఎంత జకాతును వసూలు చేసినాడు మరియు అందులో అతడు (తన రోజువారి ఖర్చుల కొరకు) ఎంత ఖర్చు పెట్టినాడు అని లెక్క అడుగగా, ఇబ్న్ లుతబియ్యహ్ ఇలా అన్నాడు: “ఇది (బనూ సులైమ్ తెగ వారి నుండి) నేను జకాతుగా వసూలు చేసిన మీ సంపద మరియు (అది గాక నా దగ్గరున్న) ఈ సంపద నాకు బహుమతిగా ఇవ్వబడింది.” అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: నీవు సత్యవంతునివే అయితే, నీకు ప్రజలు బహుమతులు ఇస్తారో లేదో చూడటానికి నీవు నీ తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు కూర్చోవు? ఆ సంపద నీకు బహుమతిగా రావడానికి కారణం నీకు అప్పగించబడిన బాధ్యతలు మరియు విధులే. నీవు నీ ఇంట్లోనే కూర్చొని ఉండి ఉంటే, నీకు ఏమీ బహుమతిగా ఇవ్వబడేది కాదు. కనుక, కేవలం అది బహుమతి రూపంలో నీకు చేరింది అనే కారణంగా నీవు దానిని చట్టబద్ధంగా పరిగణించడానికి అనుమతి లేదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపంగా ఉన్నప్పటికీ వేదిక (మెంబరు) పైకి ఎక్కి ప్రసంగించినారు. ముందుగా అల్లాహ్ ను స్తుతించి, ఆయనకు కృతఙ్ఞతలు అర్పించి ఇలా అన్నారు: “అమ్మా బ’ద్! నిశ్చయంగా అల్లాహ్ నాకు అప్పగించిన బాధ్యతలలో జకాతు వసూలు మరియు యుద్ధములో జయించిన సంపద విషయములలో ఒకరిని దాని కొరకు నియమించాను. అతడు ఆ పని నుండి తిరిగి వచ్చి ఇలా అంటాడు: “ఇది మీ కొరకు, మరియు ఇది నా బహుమతి. బహుమతిగా నాకు ఇవ్వబడింది” అని. “తన బహుమతి తనకు వస్తుందో లేదో చూడటానికి అతను తన తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు కూర్చోడు? అల్లాహ్ సాక్షిగా, తీర్పు దినమున తన మెడపై మోసుకుంటూ అల్లాహ్‌ను కలుసుకోవడం తప్ప ఎవరూ తనకు ఇచ్చిన దాని నుండి చట్టవిరుద్ధంగా ఏమీ తీసుకోరు - అది మూలుగుతూ ఉండే ఒంటె అయినా, మూలుగుతూ ఉండే ఆవు అయినా, లేదా అరచే గొర్రె అయినా. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, బలంగా తన రెండు చేతులను పైకెత్తినారు, అక్కడ కూర్చున్న వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చంకలలోని తెల్లదనాన్ని చూడగలిగినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను పైకెత్తి ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! నేను నీ తీర్పును వారికి అందజేసినాను.” ఈ హదీథు ఉల్లేఖకుడైన అబుయ్ హుమైద్ అస్సాదీ (రదియల్లాహు అన్హు) ఇది (ఈ హదీథు) తన కనులు చూసినది మరియు తన చెవులు విన్నది అని తెలియజేసినారు.