ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైనా విధిగా ఆచరించవలసిన నమాజులలో ఏదైనా నమాజును దాని సమయం దాటిపోయేంత వరకు ఆచరించుట మరిచిపోతే, అతడు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ నమాజును (ఖజా నమాజుగా) ఆచరించుటకు ఉపక్రమించాలి. ఆ విధంగా పూర్తి చేయకుండా మిగిలి పోయిన నమాజును గుర్తుకు వచ్చిన వెంటనే ఆచరించుట తప్ప, ఒక ముస్లిము ఆ నమాజును సమయం మించిపోయేంత వరకు మరిచిపోవటం (అలక్ష్యము) వలన జరిగిన పాపము అతని నుండి తొలగిపోవుట, లేదా కప్పివేయబడుట జరుగదు. అల్లాహ్ దివ్య ఖుర్’ఆన్ లో ఇలా ఆదేశించినాడు: {… وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكْرِىٓ} (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్‌ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14): అంటే, విధిగా ఆచరించవలసిన నమాజులలో దేనినైనా ఆచరించుట మరిచిపోతే, గుర్తుకు వచ్చిన వెంటనే అల్లాహ్ ను స్మరించుటకొరకు ఆ నమాజు స్థాపించుట కూడా విధి అని అర్థము.