ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసి యొక్క స్థితి మరియు అతని వ్యవహారాల పట్ల ప్రశంసా పూర్వకమైన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు; ఎందుకంటే అతడి అన్ని పరిస్థితులూ అతని కొరకు శుభాన్ని కలిగి ఉంటాయి. ఈ పరిస్థితి కేవలం ఒక విశ్వాసికి తప్ప మరింకెవ్వరికీ ఉండదు. ఒకవేళ అతనికి ఏదైనా శుభం కలిగితే అతడు దానిపై అల్లాహ్’కు కృతఙ్ఞతలు అర్పిస్తాడు, ఇంకా మరింతగా కృతజ్ఞుడై ఉంటాడు. దానికి గాను అతడు (తీర్పు దినాన) ప్రతిఫలం కూడా పొందుతాడు. అలాగే ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే అతడు దానిపై సహనం వహిస్తాడు. అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తాడు, అందుకు అతనికి ప్రతిఫలం లభిస్తుంది. కనుక ప్రతి స్థితిలోనూ అతనికి ప్రతిఫలం బహూకరించబడుతుంది.