ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ముస్లింలు తమ తోటి ముస్లిం సోదరులతో మంచిగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు మరియు తోటివారి పట్ల వారు పాటించవలసిన కొన్ని విధులు మరియు మర్యాదలను స్పష్టం చేసినారు. వాటిలో కొన్ని: మొదటి ఉపదేశం: "మీరు ఒకరిపై మరొకరు ఈర్ష్యపడకండి" — అంటే, మీరు మీ తోటి సహోదరులు పొందుతున్న ఆనందాన్ని, సంపదను కోల్పోవాలని కోరుకోకండి. రెండవ ఉపదేశం: "మీరు నజష్ (కృత్రిమ బిడ్డింగ్) చేయకండి" - అంటే, ఒక వస్తువు ధరను కృత్రిమంగా పెంచకండి - వాస్తవంగా దానిని కొనాలనే ఆలోచన అతనికి లేకపోయినా, కేవలం విక్రేతకు ప్రయోజనం కలిగించడానికో లేదా కొనుగోలుదారుకు నష్టం కలిగించడానికో ధరను పెంచడం. మూడవ ఉపదేశం: "మీరు ఒకరినొకరు ద్వేషించకండి" - అంటే, ఇతరులకు హాని కలిగించాలనే ఉద్దేశ్యన్ని కలిగి ఉండకండి. ఇది ప్రేమాభిమానాలకు విరుద్ధమైనది. అయితే, అల్లాహ్ కోసం (అధర్మాన్ని, అనైతికతను, అన్యాయాన్ని) ద్వేషించడం ఆవశ్యకం. నాల్గవది: మీ సోదరుడికి వెన్ను చూపకండి, అతనిని పట్టించుకోకుండా మరియు అతనిని విడిచిపెట్టి, అతనికి మీ వీపు చూపకండి (అతనితో సంబంధాలు త్రెంచుకోకండి). ఐదవ ఉపదేశం: "మీరు ఒకరి అమ్మకంపై మరొకరు అమ్మకం చేయకండి" - అంటే, ఎవరైనా ఒక వస్తువును కొన్న వ్యక్తితో "ఈ వస్తువు నా దగ్గర ఉంది, ఇంకా తక్కువ ధరకు లేదా మెరుగైన నాణ్యతతో ఇస్తాను" అని చెప్పడం. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సమగ్రమైన ఉపదేశం చేశారు: "మీరు సోదరుల వలే ఉండండి - పైన పేర్కొన్న నిషేధించిన పనులను వదిలేసి, ప్రేమ, ఆప్యాయత, కరుణ, మృదుత్వం మరియు మంచి పనులలో సహకారం చూపించండి. హృదయాలను పరిశుభ్రంగా ఉంచుకుని, ప్రతి స్థితిలో ఒకరికొకరు శ్రేయోభిలాషిగా ఉండండి." ఈ సోదరభావానికి అవసరమైన వాటిలో కొన్ని ఇవే: తన తోటి ముస్లిం సహోదరుడికి అన్యాయం చేయకూడదు, అతనిపై దాడి చేయకూడదు. తన తోటి ముస్లిం సహోదరుడు అన్యాయానికి గురై ఉన్నప్పుడు, అతనికి సహాయం చేయగలిగే స్థితిలో ఉండినా సహాయం చేయకుండా వదలకూడదు; అతనిపై జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు ప్రామాణికంగా తోడ్పడాలి. తన తోటి ముస్లిం సహోదరుణ్ని తక్కువగా చూడకూడదు, అతడిని అగౌరవంగా చూసి అవమానించకూడదు. ఇది మనసులో ఉన్న గర్వం వల్ల కలిగే మానసిక వైఖరి. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు స్పష్టంగా ఇలా పలికినారు: "తఖ్వా (అల్లాహ్ పట్ల భయభక్తులు) హృదయంలో ఉంటుంది." అంటే – ఒక మనిషి హృదయంలో తఖ్వా ఉంటే – అతను ఎప్పుడూ తన తోటి ముస్లిం సహోదరుణ్ని తక్కువగా చూడడు. ఒక ముస్లిం తన తోటి సోదరుడిని అవమానించడమే అతని హృదయంలోని అహంకారానికి సాక్షి, ఇది చాలా చెడ్డ గుణాలలో ఒకటి. ఈ గర్వం మనిషిని చెడు నడవడిలోకి నడిపిస్తుంది, ఇది తఖ్వాకు విరుద్ధం. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు చెప్పిన విషయాన్ని మరింత బలంగా నిర్ధారిస్తూ ఇలా పలికినారు: "ఒక ముస్లిం కొరకు, మరో ముస్లింపట్ల మూడు విషయాలు హరామ్ (నిషిద్ధం): అతని రక్తం – అంటే అతనిని చంపడం, తీవ్రంగా గాయపడే విధంగా కొట్టడం, దెబ్బతీయడం వంటి హింసాత్మక చర్యలు చేయడం. ఆతని సంపద – అతనికి చెందని ధనాన్ని అన్యాయంగా తీసుకోవడం, చీటింగ్ చేయడం, దోచుకోవడం. ఆతని గౌరవం – అతని వ్యక్తిగతాన్నీ, వంశాన్నీ, వ్యక్తిత్వాన్నీ నిందించడం, తక్కువగా మాట్లాడడం. ఇవి అన్నీ నిషిద్ధమైన పాపాలు, ఎందుకంటే ముస్లిం సహోదరుల మధ్య స్నేహం, గౌరవం మరియు రక్షణ ఉండాలి.