ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గవాసుల మరియు నరకవాసుల కొన్ని లక్షణాలను తెలియజేసినారు. స్వర్గవాసులలో ఎక్కువగా ఎవరు ఉంటారంటే: “బలహీనులు మరియు వినయవిధేయతలతో ఉండే ప్రతి ఒక్కరూ”; అంటే దాని అర్థం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయుడై, వినమ్రుడై, ఆయన ముందు తనను తాను అల్పునిగా భావించుకునే వ్యక్తి; ఎంతగా అంటే కొంతమంది ప్రజలు అతణ్ణి బలహీనుడిగా భావిస్తారు మరియు అతడిని తృణీకరిస్తారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందు వినమ్రుడై ఉండే అటువంటి వ్యక్తి, అల్లాహ్ నుండి ఆయన ఔదార్యాన్ని ఆశిస్తూ, ఒకవేళ అల్లాహ్ పేరున ఏదైనా ప్రమాణం చేస్తే అల్లాహ్ అతడి ప్రమాణాన్ని నెరవేరుస్తాడు, అతడు వేడుకున్న అతని అభ్యర్థనకు, అతడి ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. నరకవాసులలో ఎక్కువ మంది ఎవరు అంటే: “ఉతుల్” అంటే అనాగరికంగా, మొరటుగా, కఠినంగా వ్యవహరించేవాడు, మరియు తీవ్రంగా కలహాలు, తగాదాలు పెట్టుకునే వ్యక్తి; “ఫాహిష్” అంటే అసభ్యంగా, అసహ్యకరంగా ప్రవర్తించేవాడు, అశ్లీల కార్యాలకు పాల్బడేవాడు, మంచికి ఎప్పుడూ విధేయత చూపనివాడు; “జవాజ్” అంటే గర్విష్ఠుడు, తిండిపోతు, దుర్మార్గుడు, పెద్ద శరీరము గలవాడు, తన నడకలో గర్వముతో, నిక్కుతూ, నీల్గుతూ నడిచేవాడు; “ముస్తక్బిర్” అంటే సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు ఇతరులను తక్కువగా చూసేవాడు; అహంకారి.