ఈ హదీసు ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తున్నాయి: ఒక మనిషి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తన వద్ద నున్న ఇద్దరు బానిసలను గురించి ఫిర్యాదు చేస్తూ – వారు విషయాలకు సంబంధించి తనతో అబధ్ధాలాడుతారని, వారిని నమ్మితే నమ్మక ద్రోహం చేస్తారని, వ్యవహారాలలో మోసం చేస్తారని, మరియు తనపట్ల అవిధేయతతో ప్రవర్తిస్తారని, అందుకని వారిని సరిచేయడానికి తాను వారిని తిట్టే వాడినని, కొట్టే వాడినని చెప్పి; తీర్పు దినమున వారికి సంబంధించి తన పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వారి నమ్మక ద్రోహము, వారి అవిధేయత మరియు వారు నీతో అబధ్ధాలాడుట అన్నీ లెక్కలోనికి తీసుకోబడతాయి, అలాగే నీవు వారిని శిక్షించుట కూడా లెక్కలోనికి తీసుకోబడుతుంది. ఒకవేళ నీవు వారిని శిక్షించుట మరియు వారి పాపాలు సమానంగా ఉంటే, నీవు వారికి ఏమీ బాకీ ఉండవు. ఒకవేళ నీవు వారికి విధించిన శిక్ష వారి పాపాల కంటే తక్కువ ఉంటే, అది నీకొరకు ఒక వరం వంటిది. నీ పుణ్యాలలో (ప్రతిఫలములో) వృధ్ధి కలుగుతుంది. ఒకవేళ నీవు వారికి విధించిన శిక్ష వారి పాపాల కంటే ఎక్కువ ఉంటే, ఎంత ఎక్కువ ఉంటే దానికి సమానంగా నీ (పుణ్యాలలో) నుండి తీసుకోబడుతుంది మరియు వారికి ఇవ్వబడుతుంది”. అది విని ఆ మనిషి పక్కకు వెళ్ళి బిగ్గరగా ఏడవసాగాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో “అల్లాహ్ యొక్క దివ్య గ్రంథాన్ని (ఖుర్’ఆన్ ను) నీవు చదవలేదా? {మరియు పునరుత్థానదినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటుచేస్తాము, కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్కచూడటానికి మేమే చాలు!} (సూరాహ్ అల్ అంబియా 21:47). పునరుథ్థాన దినమున ఏ ఒక్కరికీ ఎటువంటీ అన్యాయము జరుగదు. ప్రజల మధ్య ఏర్పరచబడిన త్రాసులు న్యాయంగా ఉంటాయి.” అన్నారు. అపుడు ఆ మనిషి “అల్లాహ్ సాక్షిగా ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ! వారి నుంచి విడిపోయి వారిని విడిచి పెట్టడమే వారిద్దరికీ మరియు నాకూ మంచి చేకూర్చే విషయం. మీరు సాక్ష్యంగా ఉండండి, అల్లాహ్ కొరకు మరియు తీర్పు దినము నాడు లెక్క తీసుకోబడుట మరియు శిక్షకు భయపడి ఆ ఇద్దరు బానిసలకు విముక్తిని కలిగిస్తున్నాను. వారిద్దరూ స్వతంత్రులు” అన్నాడు.