హకీం ఇబ్న్ హిజాం రదియల్లాహు అన్హు ప్రాపంచిక జీవితావసరాలకు సంబంధించి కొన్ని సరుకుల కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అర్ధించినారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి వాటిని ఇచ్చినారు. హాకిం (ర) మళ్ళీ అడిగినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ వాటిని ఇచ్చినారు. తరువాత హాకిం (ర) మళ్ళీ అడిగినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ ఆయనకు ఇచ్చినారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఓ హకీమ్! ఈ సంపద మధురమైనది మరియు ఆకర్షణీయమైనది. ఎవరైతే అత్యాశకు పోకుండా, వెంటపడి ఎవరినీ యాచించకుండా దానిని తీసుకుంటాడో (సంపాదిస్తాడో) అది అతనికి ఆశీర్వాదము అవుతుంది. కానీ ఎవరైతే దాని పట్ల లాలస మరియు కోరికతో దానిని తీసుకుంటాడో (సంపాదిస్తాడో) అది అతనికి ఆశీర్వాదము అవదు. అటువంటి వాడు ఎంత తిన్నా ఎన్నటికీ తృప్తి చెందనివాని వంటి వాడు. అల్లాహ్ దృష్టిలో పైన ఉండే దానం చేసే చేయి, క్రింద ఉండే యాచించే చేయి కంటే గొప్పది.” హాకిం రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అపుడు నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ తరువాత నేను ఇంకెవరినీ, నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయే వరకూ, దేని కొరకూ అడగను.” రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఖలీఫా అబూబక్ర్ రదియల్లాహు అన్హు ఖజానా నుండి అతనికి బహుమతిగా రావలిసిన వాటాను ఇవ్వడానికి హాకిం రదియల్లాహు అన్హుని పిలిచేవారు. కానీ ఆయన ఏమీ తీసుకోకుండా నిరాకరించేవారు. అబూబక్ర్ రదియల్లాహు అన్హు తరువాత ఉమర్ రదియల్లాహు అన్హు కూడా ఆయనను పిలిచినారు, కానీ హాకిం రదియల్లాహు అన్హు ఆయన నుండి కూడా ఏమీ తీసుకోకుండా నిరాకరించినారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ ముస్లిములారా! అవిశ్వాసులతో యుద్ధం గానీ జిహాద్ గానీ చేయకుండానే సంపాదించిన యుద్ధసంపద నుండి అల్లాహ్ అతనికి కేటాయించిన అతని హక్కు వాటాను నేను అతనికి అందజేస్తున్నాను. అయినప్పటికీ అతడు దానిని తీసుకోకుండా నిరాకరిస్తున్నాడు.” ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత హకీం రదియల్లాహు అన్హు తాను చనిపోయేవరకూ ఎవరినీ ఏమీ అడుగలేదు, ఎవరి నుండీ ఏమీ తీసుకోలేదు. అల్లాహ్ ఆయన పట్ల ప్రసన్నుడవు గాక.