ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “జుల్మ్”నకు (దౌర్జన్యము, అణచివేతలకు) పాల్బడుటను గురించి హెచ్చరిస్తున్నారు. అది ప్రజల పట్ల దౌర్జన్యము గానీ, తన స్వయం పట్ల దౌర్జన్యము గానీ, లేక అల్లాహ్ యొక్క హక్కుల పట్ల దౌర్జన్యము గానీ – వీటన్నిటి పట్ల ఈ హదీథులో హెచ్చరిస్తున్నారు. “జుల్మ్” అంటే ఎవరి హక్కును వారికి చెల్లించకపోవడం. ఈ హదీథులో ప్రళయ దినమున “జుల్మ్” పొరలు కలిగిన అంధకారమై వస్తుంది అని వర్ణించడం జరిగింది – అంటే ఆ దినమునాడు “జుల్మ్” నకు పాల్బడిన వానిపై విరుచుకుపడే దుర్భరమైన శిక్షలు, భయానకమైన విషయాలు అన్నమాట. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిసినారితనం గురించి కూడా హెచ్చరించినారు. ఇక్కడ పిసినారితనం అంటే విపరీతమైన లోభము మరియు విపరీతమైన దురాశ అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు పిసినారితనం వల్ల ఒకరికి హక్కుగా చెల్లించవలసిన ఆర్థికపరమైన విషయాలలో తక్కువ చేయడం; విపరీతమైన దురాశ కారణంగా ప్రాపంచిక లాభాల పట్ల తీవ్రంగా చింతించడం. ఈ విధమైన “జుల్మ్” మన పూర్వతరాలలో కొన్నిటిని నాశనం చేసింది; అది వారిని ఒకరినొకరు చంపుకునేలా చేసింది, హరాంను హలాల్ గా చేసుకునేలా చేసింది.