ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: స్వర్గములో స్వర్గవాసులు ఉంటూ ఉండగా వారితో సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; దానికి వారు “మేము హాజరుగా ఉన్నాము ఓ మా ప్రభూ!, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన వారిని “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును ఓ మా ప్రభూ! మేము సంతృప్తిగా ఉన్నాము; నీ సృష్టిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?” అని జవాబిస్తారు. అపుడు పరమ పవిత్రుడు అయిన ఆయన “మీకు అంత కంటే ఉత్తమమైన దానిని ప్రసాదించనా?” అని అడుగుతాడు. వారు: “ఓ మా ప్రభూ! దీనికంటే ఉత్తమమైనది ఏముంటుంది?” అంటారు. (అల్లాహ్) ఇలా అంటాడు: "నేను మీపై నా శాశ్వతమైన అనుగ్రహాన్ని అవతరింపజేస్తాను. ఆ తరువాత నేను మీపై ఎలాంటి ఆగ్రహాన్ని చూపను.”