ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సాధారణంగా అల్లాహ్’తో తరుచూ చేసే దుఆ (విన్నపం) - ధర్మంలో, మరియు ఆయనకు విధేయునిగా ఉండుటలో స్థిరత్వం ప్రసాదించమని అల్లాహ్’ను కోరడం, మరియు వాటి నుండి (ధర్మము నుండి, ఆయన విధేయత నుండి) మరలిపోకుండా, మరియు మార్గభ్రష్టత్వం నుండి, తప్పుదోవల నుండి దూరంగా ఉండేలా చేయమని అల్లాహ్ ను వేడుకోవడం. అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆను తరుచూ పునరావృతం చేస్తూ ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "హృదయాలు అల్లాహ్ యొక్క రెండు వేళ్ల మధ్య ఉన్నాయి. ఆయన తాను కోరిన విధంగా వాటిని తిప్పుతాడు.” అని పలికినారు. విశ్వాసమైనా, అవిశ్వాసమైనా అవి ఉండే స్థానము ‘హృదయం’. అరబీ భాషలో హృదయాన్ని ‘అల్ ఖల్బ్’ అంటారు. ‘ఖల్బ్’ అనే పదానికి అరబీ భాషలో ‘దొర్లుట’; ‘నిలకడలేని’; ‘త్రిప్పివేయు’; ‘స్థిరత్వములేని’ అనే అర్థాలున్నాయి. ఒక కుండలో దేనినైనా ఉడకబెడుతూ ఉంటే, అది ఏవిధంగా తొందరలోనే మార్పునకు లోనవుతుందో, హృదయం కూడా అదే విధంగా స్థిరత్వం లేకుండా మారిపోతూ, తిరిగిపోతూ ఉంటుంది. అందుకనే అరబీ భాషలో హృదయాన్ని “అల్’ఖల్బ్” అన్నారు. కనుక అల్లాహ్ తాను కోరిన వాని హృదయాన్ని మార్గదర్శకంపై స్థిరంగా ఉంచుతాడు; దానిని ధర్మములో స్థిరపరుస్తాడు; మరియు తాను కోరిన వాని హృదయాన్ని సన్మార్గమునుండి తప్పిస్తాడు, మార్గభ్రష్టత్వంలో విడిచి పెడతాడు.