మదీనా యూదులలో బనూ ఖురైదా మరియు బనూ నదీర్ అనే తెగలు ఉండేవి. జాహిలియ్యా కాలంలో (అజ్ఞాన కాలంలో), వారిలో ఒకరు మరొకరిపై ఆధిపత్యం చెలాయించారు. కాబట్టి వారు ఒక ఒప్పందానికి వచ్చారు, ఏమనగా: ఆధిపత్యం గల తెగ, ఓడిపోయిన తెగకు చెందిన వ్యక్తిని చంపితే, దాని రక్తపు వెల (దియత్) కేవలం యాభై వసఖ్ లు. మరియు ఓడిపోయిన తెగ, ఆధిపత్యం గల తెగకు చెందిన వ్యక్తిని చంపితే, దాని రక్తపు వెల రెట్టింపు, అంటే నూరు వసఖ్ లు. మరియు ఒక వసఖ్ అరవై 'సా' లు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వలస వచ్చేంత వరకు వారు అదే స్థితిలో ఉన్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాకతో ఆ రెండు తెగలు ఆయనకు విధేయులయ్యారు. ఆ సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా తన శత్రువులపై విజయం సాధించలేదు, మరియు తనకు విధేయులుగా ఉండమని వారిని బలవంతపెట్టలేదు. ఎందుకంటే అది హిజ్రత్ ప్రారంభ సమయం మరియు ఆయన సంధిలో ఉన్నారు. అప్పుడు బలహీనమైన తెగవారు బలమైన తెగకు చెందిన ఒక వ్యక్తిని హత్య చేశారు. అప్పుడు బలమైన తెగవారు బలహీనమైన తెగవారికి ఇలా సందేశం పంపారు: ఒప్పందం ప్రకారం మాకు వంద వస్ఖ్ లు పంపండి. దానికి బలహీనమైన తెగవారు ఇలా అన్నారు: ధర్మం ఒక్కటే, వంశం ఒక్కటే, దేశం ఒక్కటే అయిన రెండు తెగల మధ్య ఇలా ఎప్పుడైనా జరిగిందా, ఒకరి రక్తపరిహారం మరొకరి రక్తపరిహారంలో సగమా?! మేము మీకు ఇది ఇచ్చింది కేవలం మీరు మాపై చేసిన అన్యాయం వలన మరియు మీకు భయపడి మాత్రమే. అయితే, ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినందున, మేము మీకు దానిని ఎప్పటికీ ఇవ్వము. వారిద్దరి మధ్య యుద్ధం చెలరేగేంత పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తమ మధ్య న్యాయనిర్ణేతగా చేసుకోవడానికి అంగీకరించారు. అప్పుడు ఒక గౌరవనీయురాలైన మహిళ ఆలోచించి వారికి ఇలా సలహా ఇచ్చింది: "అల్లాహ్ సాక్షి! ముహమ్మద్, వారికి మీ నుండి ఇప్పించే దానికంటే రెండింతలు మీకు వారి నుండి ఇప్పించరు. మరియు వారు నిజమే పలికారు. వారు మనకు ఇది ఇచ్చారంటే అది కేవలం మన అన్యాయం మరియు వారిపై మన బలవంతం కారణంగానే. కాబట్టి మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు రహస్యంగా ఒకరిని పంపండి, అతను మీకు ఆయన అభిప్రాయాన్ని తెలుసు కుంటాడు. ఒకవేళ ఆయన మీరు కోరినది మీకు ఇస్తే, ఆయనను న్యాయనిర్ణేతగా చేసుకోండి. ఒకవేళ ఆయన మీరు ఆశించినది ఇవ్వకపోతే, ఆయనను వదిలేయండి మరియు మీ మధ్య న్యాయనిర్ణేతగా చేసుకోకండి. అందువలన వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి కపటవిశ్వాసులలోని కొందరిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు గోప్యంగా పంపారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు, అల్లాహ్ దివ్యవాణిని అవతరింపజేసి, తన ప్రవక్తకు వారి పూర్తి విషయం గురించి మరియు వారు ఏమి తలచారో దాని గురించి తెలియజేశాడు. అప్పుడు అల్లాహ్ అజ్జ వ జల్ సూరతుల్ మాయిదలో తన ఈ వచనం నుండి: {ఓ ప్రవక్తా! "మేము విశ్వసించాము" అని పలికిన వారిలో నుండి సత్యతిరస్కారంలోకి పరుగులు తీసే వారి వల్ల నీవు దుఃఖపడకు} [మాయిద 5:41]. ఈ వచనం వరకు అవతరింపజేశాడు: {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే పాపాత్ములు.} [అల్-మాయిద 5:47] ఆ తర్వాత ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా సెలవిచ్చారు: అల్లాహ్ సాక్షిగా, ఆ రెండు తెగల విషయంలోనే ఈ ఆయతు అవతరించింది: {ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే అవిశ్వాసులు.} [అల్-మాయిదా 5:44] మరియు{...వారే దుర్మార్గులు} [అల్-మాయిదా 5:45] మరియు {...వారే పాపాత్ములు} [అల్-మాయిదా 5:47], మరియు అల్లాహ్ అజ్జ వ జల్ ఆ రెండు తెగలను ఉద్దేశించారు.