విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేస్తున్నారు: రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు వచ్చిన మొదటి దివ్యవాణి ఆయనకు నిద్రలో ఒక నిజమైన కల రూపంలో వచ్చింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిద్రలో ఏ కలను వచ్చినా, అది స్పష్టంగా వచ్చిన తెల్లవారుజాము వెలుగు వలె నిజమై పోయేది. తరువాతా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏకాంతముగా గడపడం ఇష్టం కాసాగింది. ఆయన తనను తాను ఇతరుల నుండి వేరు చేసుకుని హిరా గుహలో, తన కుటుంబము వద్దకు తిరిగి వచ్చేంత వరకు, అనేక రాత్రులు ఆరాధనలో గడిపేవారు. అన్ని రోజులు గడపడానికి సరిపడా సరంజామా తీసుకుని వెళ్ళేవారు. సరంజామా నిండుకున్నప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) విశ్వాసుల మాతృమూర్తి అయిన ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) వద్దకు తిరిగి వచ్చి తిరిగి అన్ని రోజులకు సరిపడా సరంజామా తీసుకుని వెళ్ళేవారు. చివరికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిరా గుహలో ఉన్నప్పుడు వారి వద్దకు సత్య సందేశం రానే వచ్చింది. జిబ్రయీల్ (అలైహిస్సలాం) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి “పఠించు” అన్నారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నాకు తెలీదు ఎలా పఠించాలో” అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సంఘటను గురించి ఇంకా ఇలా వివరించారు: “అపుడు ఆయన నన్ను తన రెండు బాహువులలోనికి తీసుకుని నేను భరించలేనంత గట్టిగా, ఊపిరాడక అలసిపోయేలా ఒడిసి పట్టుకున్నాడు, తరువాత వదిలి “పఠించు” అన్నాడు. నేను “ఎలా పఠించాలో నాకు తెలియదు” అన్నాను; ఆయన రెండవసారి నన్ను తన రెండు బాహువులలోనికి తీసుకుని నేను భరించలేనంత గట్టిగా, ఊపిరాడక అలసిపోయేలా ఒడిసి పట్టుకున్నాడు, తరువాత వదిలి “పఠించు” అన్నాడు. నేను “ఎలా పఠించాలో నాకు తెలియదు” అన్నాను; ఆయన నన్ను మూడవసారి తన రెండు బాహువులలోనికి తీసుకుని నేను భరించలేనంత గట్టిగా, ఊపిరాడక అలసొపోయేలా ఒడిసి పట్టుకున్నాడు, తరువాత వదిలి ఇలా అన్నాడు: {ఇఖ్ర’బిస్మిరబ్బికల్లజీ ఖలఖ్; ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్; ఇఖ్ర’ వరబ్బుకల్ అక్రమ్} [“చదువు, నీ ప్రభువు నామమున, ఎవరైతే సర్వమూ సృష్టించినాడో; ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు, చదువు! నీ ప్రభువు పరమదయాళువు] (సూరహ్ అల్ అలఖ్ 96:1-3) అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణ భయంతో హృదయం వణుకుతూ ఆయనపై అవతరించిన ఆ ఆయతులతో తిరిగి వచ్చారు. ఆయన, తన భార్య, విశ్వాసుల తల్లి ఖాదీజా బింత్ ఖువైలిద్ (రజియల్లాహు అన్హా) వద్దకు వెళ్లి ఇలా అన్నారు: “నన్ను దుప్పటితో కప్పివేయి, నన్ను దుప్పటితో కప్పివేయి” అన్నారు. వారు ఆయన (స) ను కప్పివేసారు. కొద్ది సేపటికి ఆయన భయం తొలగిపోయింది. అపుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖదీజా (రదియల్లాహు అన్హా) తో మాట్లాడినారు. ఆమెకు జరిగినదంతా వివరించినారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖదీజా (రదియల్లాహు అన్హా) తో ఇలా అన్నారు: “నా ప్రాణం పోతుందేమో అన్నంత భయపడినాను”. దానికి ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: లేదు, అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ మిమ్మల్ని ఎప్పటికీ అవమానించడు. మీరు కుటుంబ సంబంధాలను కొనసాగిస్తారు, తమను తాము చూసుకోలేని బలహీనులకు సహాయం చేస్తారు మరియు పేదలు మరియు నిరాశ్రయులకు మద్దతు ఇస్తారు, ప్రజలకు మరెవరి దగ్గర దొరకని వాటిని అందిస్తారు. మీరు అతిథులను ఆదరిస్తారు మరియు అవసరమైన సమయాల్లో సహాయం చేస్తారు. ఖదీజా (రదియల్లాహు అన్హా) అతనిని తన బంధువు అయిన వరఖా ఇబ్న్ నౌఫాల్ ఇబ్న్ అసద్ ఇబ్న్ అబ్ద్ అల్-ఉజ్జా వద్దకు తీసుకువెళ్ళినారు. అఙ్ఞాన కాలపు పూర్వపు ఆచారాలను వదిలి క్రైస్తవుడైన వ్యక్తి అతడు. అల్లాహ్ ఇష్టపడినంత వరకు అతను బైబిల్ నుండి హిబ్రూ భాషలో వ్రాసేవాడు. ఆయన కంటిచూపు కోల్పోయిన వృద్ధుడు. ఖదీజా (రదియల్లాహు అన్హా) అతనితో ఇలా అన్నారు: "ఓ సోదరా! నీ మేనల్లుడు చెప్పేది ఒకసారి వినండి." వారఖా అన్నాడు, "ఓ మేనల్లుడా! నీవు ఏమి చూసినావు?" రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను చూసిన దానిని అతనికి చెప్పినారు. వరఖా ఇలా అన్నాడు, "ఆయన, అల్లాహ్ తన ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వద్దకు పంపిన దైవదూత జిబ్రీల్ (అలైహిస్సలాం). నేను ఇంకా యువకునిగా మరియు మంచి స్థితిలో ఉంటే బాగుండేది. మీ ప్రజలు నిన్ను బహిష్కరించినప్పుడు నేను జీవించి ఉంటే బాగుండేది." అది విని రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆశ్చర్యంగా "నావారు నన్ను బహిష్కరిస్తారా?" అని అడిగారు. దానికి అతను, "అవును. నువ్వు తెచ్చిన దానిలాంటిది ఏ మనిషి కూడా ఎప్పుడూ తీసుకురాలేదు, అలాంటి వానికి హాని జరిగింది, అణచివేయబడినాడు తప్ప. నీకు అలా జరుగబోయే రోజు చూడటానికి నేను బ్రతికి ఉంటే, నీకు విజయం కలిగేలాగా బలంగా మద్దతు ఇస్తాను" అన్నాడు. ఆ తరువాత వరఖా కొద్ది రోజులకే చనిపోయినాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దివ్యవాణి అవతరణ కొద్ది రోజులపాటు నిలిచిపోయింది.