అల్లాహ్ మనిషికి ఇచ్చిన రెండు గొప్ప అనుగ్రహాల గురించి ప్రవక్త ﷺ ఇలా తెలిపినారు - అవి: ఆరోగ్యం మరియు తీరిక సమయం. చాలామంది ఈ రెండింటి విషయంలో నష్టపోతారు, ఎందుకంటే అవి ఉన్నప్పుడు వాటిని సరిగ్గా ఉపయోగించరు, వృథా చేస్తారు. ఒక మనిషికి ఆరోగ్యం కూడా ఉంది, ఖాళీ సమయం కూడా ఉంది, కానీ అతడు అల్లాహ్ ఆజ్ఞలకు విధేయత చూపకుండా, ఆలస్యంగా, అలసత్వంతో సమయాన్ని వృథా చేస్తే — అతడు నష్టపోయినవాడు అవుతాడు. చాలా మంది పరిస్థితి ఇలానే ఉంటుంది. కానీ, ఎవరు తమ ఆరోగ్యాన్ని, ఖాళీ సమయాన్ని అల్లాహ్ ఆజ్ఞలకు లోబడి, ఆయన విధేయతలో, మంచిపనుల్లో వినియోగిస్తారో — వారే నిజంగా లాభం పొందేవారు. ఈ ప్రపంచం పరలోక పంటను సాగు చేయడానికి ఉపయోగపడే ఒక పంటభూమి. ఇక్కడ చేసే మంచిపనుల లాభం పరలోకంలో కనిపిస్తుంది. ఖాళీ సమయం తర్వాత పనిలో నిమగ్నమైపోతారు అంటే బిజీ అయిపోతారు, ఆరోగ్యం తర్వాత అనారోగ్యం వస్తుంది, చివరికి వృద్ధాప్యం అయినా సరే, ఆరోగ్యం కోల్పోతారు.