ఈ హదీసులో తన ఉమ్మత్’లో కొన్ని పనులు చేసే వాడిని “అతడు మాలోని వాడు కాడు” అని హెచ్చరించినారు. మొదటిది: “ఎవరైతే (పక్షిని) ఎగురవేసినాడో లేదా తన కొరకు (పక్షిని) ఎగురవేయమని నియమించినాడో”. ఈ ఆచారానికి మూలము – ఆ కాలములో ఎవరైనా ఏదైనా పని చేయాలని తలపెడితే, ఉదాహరణకు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని, లేక ఏదైనా దూర ప్రయాణము చేయాలని నిర్ణయించుకుంటే, లేదా ఇంకేదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే – ముందుగా అతడు ఒక పక్షిని ఎగురవేసేవాడు (లేదా తన కొరకు పక్షిని ఎగురవేయమని ఎవరినైనా కోరేవాడు). ఆ పక్షి ఒకవేళ కుడివైపునకు ఎగిరిపోతే, శుభం జరుగుతుందని భావించి ఆ పని మొదలుపెట్టేవాడు. ఒకవేళ ఆ పక్షి ఎడమ వైపునకు ఎగిరిపోతే, అశుభం జరుగుతుందని భావించి ఆ పని చేయడం నుండి వెనుకడుగు వేసేవాడు. ఈ విధంగా తాను ఏదైనా పని చేయడానికి ముందు తాను స్వయంగా శకునం చూడడం లేదా ఎవరి చేతనైనా చేయించడం ఈ రెండూ నిషేధించబడినవే. ఎవరి ద్వారానైనా విని లేదా ఏదైనా చూసి అపశకునమని విశ్వసించడం (లేదా మంచి శకునమని విశ్వసించడం), అలాగే జంతువులను చూసి లేదా ఏదైనా అంగవైకల్యం గల వారిని చూసి ఆ విధంగా విశ్వసించడం లేదా ఫలానా అంకెలు లేదా ఫలానా రోజులు అపశకునమైనవి విశ్వసించడం, ఈ విధంగా మరింక దేనినైనా మంచి శకునానికి, అపశకునానికి, శుభానికి, అశుభానికి కారణాలుగా, ప్రతీకలుగా చూడడం, విశ్వసించడం – ఇవన్నీ కూడా ఇందులోనికే వస్తాయి. రెండవది: “ఎవరైనా జోస్యము చెప్పడం లేదా తన కొరకు జోస్యం చెప్పించుకోవడం”: నక్షత్రాలను లేదా అలాంటి ఇతరములను ఆధారం చేసుకుని ఎవరైనా తనకు అగోచర విషయాల ఙ్ఞానము ఉందని దావా చేసినట్లయితే లేదా అలా దావా చేసే వాని వద్దకు అంటే జోతిష్కుని వద్దకు వెళ్ళినా లేదా అతడు చెప్పిన దానిని విశ్వసించినా – అలాంటి వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని (ఖుర్’ఆన్ ను) విశ్వసించలేదు. మూడవది: “చేతబడి”: అంటే చేతబడి చేసినా లేదా చేతబడి చేయమని ఎవరినైనా నియమించినా. సాధారణంగా ఇది ఎవరికైనా లాభం గానీ లేక నష్టం గానీ కలిగించడానికి – నిషేధిత మంత్రాలను ఉచ్ఛరిస్తూ దారాలపై ముడులు వేసి వాటిపై ఊదుతూ చేయబడుతుంది.